తిరుమల శ్రీవారి పరకామణిలో రవికుమార్ అనే క్లర్క్ చేసిన చోరీ ఘటనపై హైదరాబాద్ లో కొంత మంది పెద్దలతో కలిసి టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేడీ లక్ష్మినారాయణ సహా పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు. వారంతా తమ తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రభుత్వం మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయాలన్నారు. నిజానికి ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉంది. కోర్టు అన్ని రికార్డులు అడిగింది.. ఆ మేరకు పోలీసులు సమర్పించారు.
పరకామణిలో రవికుమార్ అనే క్లర్క్ ఏళ్ల తడబడి చేసిన దొంగతనం అంశం ఇప్పుడు రాజకీయం అవుతోంది. వైసీపీ హయాంలో దొంగ దొరికాడు. దొరికిన దొంగపై కేసు పెట్టి.. ఆయన వద్ద నుంచి కొన్ని ఆస్తులు టీటీడీకి రాయించి కేసును రాజీ చేశారు. ఇలా దొంగతో రాజీ చేసుకోవడం ఏమిటని.. వైసీపీ ఓడిపోయాక బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఈ అంశాన్ని బయట పెట్టి ఆరోపణలు చేశారు. టీటీడీకి రాసిచ్చింది కొద్దిగేనని.. ఇంకా వంద కోట్ల ఆస్తులు వైసీపీ నేతలు, అప్పటి టీటీడీ ముఖ్య అధికారులు రాయించుకున్నారని ఆయన ఆరోపించారు.
తర్వాత ఇప్పుడు మళ్లీ హైకోర్టులో పిటిషన్ నమోదయ్యాక మరింత యాక్టివ్ అయ్యారు. అందులో ఏం జరిగిందో తనకు మొత్తం తెలుసుని ఆయన అంటున్నారు. ఇందులో అప్పటి టీటీడీ పెద్దలు, వైసీపీ నేతలు ఉన్నారని.. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. ఎంత చేసినా తాను ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గబోనని చెబుతున్నారు.