ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ తన గడుసుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆయన, కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. కేవలం హస్తం గుర్తుపైనే ఆధారపడకుండా, ఖమ్మం గడ్డపై ప్రభావం చూపగల అన్ని పార్టీల ఓట్లను కొల్లగొట్టేలా ఆయన వేస్తున్న ఎత్తుగడలు వైరల్ అవుతున్నాయి.
అన్ని పార్టీలూ పొంగులేటివే!
పొంగులేటి మార్క్ పాలిటిక్స్‌లో అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే.. ప్రత్యర్థి పార్టీల జెండాలను కూడా తన ప్రచారంలో ఓటు బ్యాంకు ఆయుధాలుగా వాడుకోవడం. ఆయన ర్యాలీల్లో టీడీపీ, వైసీపీ, జనసేన జెండాలు ఉంటున్నాయి. నిజానికి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. కానీ, అదే జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీడీపీ క్యాడర్ దగ్గర కావడంతో ఆ పాత క్యాడర్ ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు పొంగులేటి ఏమాత్రం సంకోచించకుండా పసుపు జెండాలను వాడేస్తున్నారు. మంత్రులం ఇద్దరం కలిసే ఉన్నాం.. మీరంతా మావారే అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నారు.
బీఆర్ఎస్ కు సపోర్టు వైసీపీ..కానీ ఖమ్మంలో కాదు !
ఇక వైసీపీ విషయంలో పొంగులేటి అనుసరిస్తున్న వ్యూహం మరింత గడుసుగా ఉంది. వైసీపీ – బీఆర్ఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఖమ్మం వరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. గతంలో వైసీపీలో పని చేసిన పరిచయాలు, వ్యక్తిగత అనుబంధాలను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను పొంగులేటి దాదాపు హైజాక్ చేసేశారు. వైసీపీ అధిష్టానం ఆలోచనలతో సంబంధం లేకుండా, క్షేత్రస్థాయిలో ఆ జెండాలను తన అనుచరుల చేత పట్టుకోనిస్తూ కాంగ్రెస్ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.
జెండాలు మాత్రమే .. ఓటర్లు కాదు !
అంతటితో ఆగకుండా, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన జెండాలను కూడా ప్రచారంలో జోడించి పొంగులేటి తన గడుసుతనానికి పరాకాష్టను చూపించారు. ఏపీలో కూటమిలో ఉన్న జనసేన ఓటర్లు ఖమ్మంలో ఎటు వెళ్తారో అన్న సందిగ్ధత లేకుండా, ముందే ఆ జెండాలను కూడా తన ప్రచార రథాలకు కట్టేయడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి జెండా ఏదైనా.. అజెండా మాత్రం కాంగ్రెస్ గెలుపే అన్నట్లుగా పొంగులేటి చేస్తున్న ఈ మల్టీ పార్టీ ప్రచారం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మాత్రం చాణక్యం చాలు.. కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడానికి అని కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు.
