ప్రభుదేవా… డాన్స్‌కి కొత్త నడకలు నేర్పిన నాట్యాచారుడు. ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేదా? అని ఆశ్చర్యానికి గురి చేసే.. మ్యాజిక్, స్పీడో మీటరుకి అందని వేగం – ప్రభుదేవా సొంతం. ఇండియన్ మైఖెల్ జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. రెండు సార్లు జాతీయ అవార్డుల్ని అందుకున్నాడు. భారతీయ చలన చిత్రసీమలో డాన్స్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుదేవా, ఎన్నో పాటల్లో వెరైటీ స్టెప్పులతో ఆకట్టుకున్న ప్రభుదేవాకు కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం పద్మశ్రీ లభించింది. సుందరం మాస్టర్ తనయుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి, డాన్స్ అసిస్టెంట్‌గా, డాన్స్ డైరెక్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనలోని వివిధ కోణాల్ని పరిచయం చేసి, దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభుదేవా.. ఇప్పుడు పద్మశ్రీ ప్రభుదేవాగా మారాడు. కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ప్రభుదేవా పేరు కూడా ఉంది. కర్నాటక లోని మైసూర్ లో ఏప్రిల్ 3, 1973 లో జన్మించాడు. చెన్నై లో పెరిగాడు. చిన్నతనంలో ఫుట్ బాల్ మీద ఆసక్తి ఉండేది. తండ్రి సుందరం మాస్టారు పేరు పొందిన నృత్య దర్శకుడు. ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నటులు, నృత్యదర్శకులే.