స్టార్టప్‌లో ఐకానిక్‌ నిర్మాణాలే

రాజధాని అమరావతి నిర్మాణంలో ఏం జరుగుతుందో ఎన్ని ప్లాన్లు వేస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో లోతుగా పరిశీలించేవారికి తప్ప తెలియని స్థితి. సీడ్‌ క్యాపిటల్‌,కోర్‌ క్యాపిటల్‌, స్టార్టప్‌ క్యాపిటల్‌ ఇలా అంటుంటే ఏది ఏమిటో అర్థం కాని అయోమయం. ఇక డిజైన్ల విషయంలోనూ ఇప్పటికి రెండు మూడు కంపెనీలు అయిపోగా ఇప్పుడు నార్మన్‌ పోస్టర్‌ ఇచ్చినవాటిపై పడ్డారు. వాటిని అధ్యయనంచేసేందుకు లోకేశ్‌ సహా ఒక కమిటీ వేశారు. ఈ లోగా మే 15వ తేదీన స్టార్టప్‌ క్యాపిటల్‌ శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరప్పల సమక్షంలో జరుగుతుందని ప్రకటించారు. నిజం చెప్పాలంటే పెద్ద వేడుకకే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికి ప్రధాని మోడీ చేసిన శంకుస్తాపనతో సహా చాలా తతంగాలు చూస్తున్నాం గనక ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. 1600 ఎకరాలలో సింగపూర్‌ కన్సార్టియం కట్టే స్టార్టప్‌ క్యాపిటల్‌లో యాభై ఎకరాల పని మాత్రమే ఇప్పుడు మొదలవుతుంది. ప్రధానాకర్షణగా వుండే ఐకానిక్‌ కట్టడాలు మొదలు పెడతారట. తర్వాత కొన్ని ముఖ్యమైన పాలనా భవనాలు. వాటితో ఒక వాతావరణం ఏర్పడి అయిదేళ్లలోనే మొత్తం వాణిజ్య ప్లాట్టు అమ్మిపెడతామని సింగపూర్‌ కన్సార్టియం అంటున్నది. వాస్తవానికి వారికి పదిహేనేళ్ల గడువు ఇచ్చారు. ఈ లోగానే తమ పలుకుబడితో అన్నీ అమ్మి నిధులు రాబడతామని కన్సార్టియం చెబుతున్న దాని నిజానిజాలు తెలుస్తాయి. కోర్‌ క్యాపిటల్‌ అంటున్నా నిజానికి సాంకేతికంగా అటాటిదేమీ లేదట.సీడ్‌ క్యాపిటల్‌ వుంది. స్టార్టప్‌ అన్నది ఈ ఐకానిక్‌ కట్టడాల భాగానికి పెట్టుకున్న పేరట. ఏదైతేనేం మరో హంగామా.. హడావుడి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.