ప్రొ.నాగేశ్వర్: తెలంగాణనూ మోసగించిన మోడీ..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా ఉద్యమాలు చాలా తీవ్రంగా జరగడం వల్ల.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందన్న అభిప్రాయం కలిగింది. అదే సమయంలో తెలంగాణకు మేలు చేసిందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది. కారణం ఏమిటంటే.. తెలంగాణలోని రాజకీయ వ్యవస్థ కేంద్రంతో పోరాడటం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, కేసీఆర్… ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఘర్షణ పూరిత వైఖరి తీసుకోవడం లేదు. అడపాదడపా విమర్శలు చేసినా.. అవి తూ.తూమంత్రంగా ఉండటంతో.. ఈ అభిప్రాయం ఏర్పడింది. కానీ వాస్తవంగా విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదు. ఏపీకి జరిగినట్లే.. తెలంగాణకూ నష్టం జరుగుతోంది.

తెలంగాణ జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు..!

జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్ ను ప్రతి రాష్ట్రానికి సహజంగా ఒకటి ఇస్తూంటారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చారు. ఈ విషయాన్ని విభజన చట్టంలో కూడా పెట్టారు. కానీ తెలంగాణలో ఏ ప్రాజెక్టుకీ జాతీయ హోదా ఇవ్వలేదు. సంప్రదాయంగా రాష్ట్రానికి ఓ ప్రాజెక్ట్ ను జాతీయహోదా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ… తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..?. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదే పదే కోరుతోంది. ఈ విజ్ఞప్తికి ఎక్కడా సానుకూలత కనిపించడం లేదు. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సుష్మాస్వరాజ్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ ఎక్కడకు వెళ్లింది..?

కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు..!

కొత్తగా కేంద్రం జాతీయ ప్రాజెక్టులు ఇవ్వకపోవచ్చు. కానీ అప్పటికే ఇచ్చిన ప్రాజెక్టులైనా గౌరవిస్తుందా.. అంటే అదీ లేదు. యూపీఏ హయంలోనే ఐటీఐఆర్ ప్రాజెక్ట్.. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ను హైదరాబాద్ కు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేసి ఉన్నట్లయితే… భారతదేశంలో ఉన్న ఐటీ నగరాల్లో హైదరాబాద్ టాప్ పొజిషన్లోఉండేది. 2013లో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ ను ఐదేళ్ల తర్వాత 2018లో రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇరిగేషన్ రంగంలో ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఐటీ రంగంలో ఇచ్చిన జాతీయ ప్రాజెక్టును కూడా రద్దు చేశారు.

ప్రతీ రాష్ట్రానికి ఇచ్చే ఎయిమ్స్ కూడా ఇవ్వలేదు..!

ఇక మూడోది ఎయిమ్స్. ప్రతి రాష్ట్రానికి ఓ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ కు కూడా మంజూరు చేశారు. ఇంత వరకూ తెలంగాణకు ఇవ్వలేదు. బీబీనగర్ లో ఉన్న నిమ్స్ ను.. ఎయిమ్స్ గా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఉంది. కానీ కేంద్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు. ఇక కేంద్రం తెలంగాణకు చేస్తున్న నాలుగో నష్టం బయ్యారం స్టీల్ ప్లాంట్. ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటాలు జరగడం లేదు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టేంత క్వాలిటీ ఐరన్ లేదని చెబుతున్నారు. కానీ బయ్యారంలో దొరికే…ఖనిజం లాంటి వాటితోనే.. స్టీల్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు విదేశాల్లో ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి.. అలా ప్లాంట్ పెట్టవచ్చు కదా..! కానీ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు.

హైకోర్టు విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు..!

తెలంగాణ ఏర్పటయింది కానీ న్యాయవ్యవస్థ సెపరేట్ కాలేదు. అంటే హైకోర్టు విభజన పూర్తి కాలేదు. శాసనమండలి ఎన్నికల్లో హైదరాబాద్ కు ప్రచారానికి వచ్చిన కేంద్ర న్యాయమంత్రి.. హైకోర్టును వీలైనంత త్వరగా విభజిస్తామని ప్రకటించారు. ఇంత వరకూ విభజించలేదు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని ఉంది. ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాకు కలిపి ఏడాది రూ. 350 కోట్లు ఇచ్చారు. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది.కానీ ఏపీకి చేసినట్లుగా ఎలాంటి సాయమూ చేయలేదు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు దాని ప్రస్తావన లేదు. 2014-15 రైల్వే బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. కానీ పట్టించుకోలేదు. కొద్ది రోజుల కిందట..కేసీఆర్.. ప్రధానిని కలిసినప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిని కూడా వివరించారు. కానీ కేంద్రం నుంచి కదలిక లేదు. నిజామాబాద్ పసుపు పరిశోధనా కేంద్రం పెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వ డిమాండ్. కానీ పట్టించుకోవడం లేదు.

తెలంగాణ భారీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చలేదు..!

అలాగే రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ లాంటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కూడా… కేంద్రం సహకరించలేదు. ఐఐఎం, ఎన్ఐటీ ఏర్పాటు చేయడంలనూ నిర్లక్ష్యం చూపించారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వీటిని ఏర్పాటు చేయాడానికి ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్ దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటి. అన్ని రంగాల్లో ముందున్న నగరం. ఇక్కడ ఐండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టకపోతే ఎలా..? హైదరాబాద్ కు జరుగుతున్న ఈ నష్టాన్ని ఎవరు భరించాలి..? తెలంగాణలో తొమ్మిది, పదిశాతం గిరిజన జనాభా ఉన్నారు. ట్రైబల్ యూనివర్శిటీ పెడతామన్నారు. కానీ పెట్టలేదు. ఇండస్ట్రియన్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు ఇండస్ట్రియన్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. కానీ ఇవ్వడం లేదు. హైదరాబాద్ మినహా.. తెలంగాణలోని వెనుబడిన జిల్లాలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వరు..?

మొత్తంగా చూస్తే.. కేంద్ర ప్రభుత్వం ఏపీతో పాటు తెంలగాణకూ ఎలాంటి న్యాయం చేయలేదు. కాకపోతే.. ఏపీలో అక్కడి రాజకీయ పార్టీలు.. ఆ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాయి. తెలంగాణలో మాత్రం … కేంద్రంపై ఎవరూ పోరాడటం లేదు. అందుకే తెలంగాణకు కేంద్రం సాయం చేసిందనే వస్తోంది.. కానీ అది నిజం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com