ప్రొ.నాగేశ్వర్ : కేసీఆర్ ఎన్నికల వ్యూహాలను విపక్షాలు ఎదుర్కోగలవా..?

ఎన్నికల వేడి పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. మళ్లీ ప్రచార సభలు ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మహాకూటమి సన్నాహాలు కూడా ఫైనల్ కు చేరుకున్నాయి. విపక్ష కూటమి మొత్తం ఏకమవడంతో.. కేసీఆర్ ప్రచార వ్యూహాన్ని విభిన్నంగా ఖరారు చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌కు ప్రజల్లో సానుకూలత ఉందా..?

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. కేసీఆర్ పట్ల సానుకూలత ఉంది. పూర్తిగా ఉందని అర్థం కాదు. కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. మరికొన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కొన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఇలా మొత్తం విశాలంగా ఆలోచిస్తే.. కేసీఆర్‌కు సానుకూలత ఉంది. ఇది అర్థమయ్యే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇదే అర్థమయ్యే.. కేసీఆర్ తనకు ఓటు వేయమంటున్నారు. అభ్యర్థుల అంశాలను కూడా హైలెట్ చేయకుండా.. కేవలం తనకు మాత్రమే ఓటు వేయమని కేసీఆర్ ప్రచారం చేయబోతున్నారు. ప్రచార బాధ్యతలు కూడా తనే తీసుకుని అత్యధిక నియోజకవర్గాల్లో… ఆయనే ప్రచారం చేయబోతున్నారు. ప్రతిపక్షాలకు వచ్చే సరికి.. టీఆర్ఎస్ లో కేసీఆర్ స్థాయిలో.. ప్రతిపక్ష నేతల్లో ఆ స్థాయి ఆమోదం ప్రజల్లో ఎవరికీ కనబడటం లేదు. ఇది కేసీఆర్‌కు వచ్చే అడ్వాంటేజ్.

వ్యూహం నెం.1 : కేసీఆర్‌కే ఓటు వేయాలని ప్రచారం..!

టీఆర్ఎస్ ప్రచార వ్యూహంలో మొదటి అంశం ఏమిటంటే.. “వోట్ ఫర్ కేసీఆర్”. ఎమ్మెల్యేను చూడకండి.. పార్టీని కూడా చూడండి.. కేవలం కేసీఆర్ కోసమే… ఓటు వేయండి అని ప్రచారం చేస్తున్నారు. కొన్ని సర్వేలను పరిశీలిస్తే.. కేసీఆర్ పట్ల ఉన్న సానుకూలతతో పోలిస్తే.. టీఆర్ఎస్ పట్ల అంత సానుకూలత లేదు. ఉదాహరణకు కేసీఆర్‌కు 60 శాతం సానుకూలత ఉంటే..అది టీఆర్ఎస్ దగ్గరకు వచ్చే సరికి యాభై శాతం… ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చే సరికి.. ముఫ్పై శాతానికి పడిపోతోంది. కేసీఆర్ కన్నా.. పార్టీకి తక్కువ ఉంది… పార్టీ కన్నా ఎమ్మెల్యేలకు తక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి… ఎమ్మెల్యేలకు ఓటు వేయడం లేదు.. ఆ మాట కొస్తే.. పార్టీకి కూడా ఓటు వేయడం లేదు.. కేవలం కేసీఆర్‌కు మాత్రమే ఓటు వేస్తున్నారన్న ప్రచార వ్యూహాన్ని టీఆర్ఎస్ ఖరారు చేసుకుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా.. కేసీఆర్ వ్యూహంలో చిక్కుకుంటున్నాయి. ఆ పార్టీలన్నీ తమ టార్గెట్‌ను కేసీఆర్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. కేసీఆర్ ఏం కోరుకుంటున్నారో… ప్రతిపక్ష పార్టీలు కూడా అవే చేస్తున్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. కేసీఆర్ వర్సెస్ రెస్టాఫ్ తెలంగాణ అన్నట్లుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా జరిగితే అది కచ్చితంగా కేసీఆర్‌కు లాభం జరిగేలా చేస్తుంది. కేసీఆర్ ప్రచారం వ్యూహంలో ఇదే మొదటి అంశం.

వ్యూహం నెం.2 : విపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీయడం..!

కేసీఆర్ ప్రచారం వ్యూహంలో.. రెండో అంశం.. ప్రతిక్షాల ఐక్యత దెబ్బతీయడం. కేసీఆర్.. ఎన్నిపార్టీలు ఏమైనా తమకు వంద సీట్లు వస్తాయని చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న జాగ్రత్లు చూస్తే.. ప్రతిపక్షాలు ఐక్యమవడం గురించి వర్రీ అవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షల ఐక్యతను దెబ్బతీసి… ప్రతిపక్ష ఐక్యతను బద్నాం చేయడం ద్వారా… ఎన్నికలను ఎదుర్కోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇటీవలి కాలంలో కేటీఆర్ ప్రసంగాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. మొత్తంగా కేసీఆర్ భాషలోనే ఆయన మాట్లాడుతున్నారు. మహాకూటమిని స్వాహా కూటమి అంటున్నారు. అసలు కాంగ్రె, టీడీపీల మధ్య పొత్తులేమిటని ప్రశ్నిస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే.. ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుదంని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆత్మ గురించి టీఆర్ఎస్ బాధపడాల్సిన పనేముంది..?. అంటే.. కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు లేకుండా చూడాలి. ఒక వేళ పొత్తు ఉన్నా…రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగకుండా చూడాలి. తటస్థ ఓటర్లు.. ఈ కూటమి వైపు ఆకర్షణకు గురవుకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకో కేటీఆర్ కోదండరాంను కూడా టార్గెట్ చేస్తున్నారు. మహాకూటమి ఏర్పడితే.. ప్రజల్లో ఓ ఆలోచన వస్తుంది. ఇప్పటి వరకూ.. కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరన్న భావన ఉంది. కానీ బలంగా మహాకూటమి బరిలోకి రావడం వల్ల .. కేసీఆర్‌ను ఓడించగలరు అనే భావన ప్రజల్లోకి వస్తే… తటస్థ ఓటరు… ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఓటర్లు ఆ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇది టీఆర్ఎస్‌కు నష్టం చేకూరుస్తుంది. అందుకే ఎలాగైనా… కూటమిని విచిన్నం చేయాలనుకుంటున్నారు.

వ్యూహం నెం.3 : తెలంగాణ సెంటిమెంట్‌ను వీలైనంతగా పెంచడం.. !

తెలంగాణ సెంటిమెంట్‌ను వీలైంతగా పెంచుకోవాలనేది..టీఆర్ఎస్ మరో ఎన్నికల వ్యూహం. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతల ప్రసంగాలు చూస్తే.. మహాకూటమి గెలిస్తే.. అమరావతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఏపీకి బానిసలుగా ఉండాలని చెబుతున్నారు. ఇలాంటి మాలన్నింటి వెనుక లక్ష్యం… తెలంగాణసెంటిమెంట్‌ను మళ్లీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే. ఇలా సెంటిమెంట్ పెంచడం ద్వారా ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టవచ్చనేది టీఆర్ఎస్ ఆలోచన. అలాంటి సెంటిమెంట్ బలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. అప్పుడు ఉన్నంత బలం టీడీపీకి ఇప్పుడు లేకపోయినా.. తీసి పడేసే పరిస్థితి లేదు. అందుకే.. తెలంగాణ సెంటిమెంట్‌ను పండించి… ఎన్నికల వ్యూహం అమలు చేయాలనుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్‌లో అసంతృప్తులు… ఇంకా పూర్తి స్థాయిలో బహిరంగంగా బయటు రావడం లేదు. అసలు.. అసంతృప్తులు… బీఫాంలు ఇచ్చే ముందు బయటకు వస్తారు.

కూటమి కట్టినందు వల్లే గెలుపు రాదు..!

ప్రతిపక్షాలన్నీ ఏకమవడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలేము. కానీ.. మహాకూటమి వల్ల బలాలు పోగవుతాయి. చిన్నాచితకో.. కొద్దో గొప్పో… బలం పోగవడం వల్ల… బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అధికార వ్యతిరేకత ఉన్నప్పుడు… రాజశేఖర్ రెడ్డి ఓ బలమైన నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. ఆయనను ప్రజలు ఆదరించారు. అప్పుడు కూటమిగా విజయం సాధించారు. కానీ చంద్రబాబు 2009లో విజయం సాధించలేదు. కూటమిని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు కాబట్టే.. కేసీఆర్, కేటీఆర్ విమమర్శలు చేస్తున్నారు. రాజకీయ ఫలితం మొత్తం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు కన్సాలిడేట్ అవుతాయా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పూర్తి స్థాయిలో కేసీఆర్ వ్యతిరేక ఓట్లు కన్సాలిడేట్ కావు. ఎందుకంటే… బీజేపీ విడిగా పోటీ చేస్తోంది.. బీఎల్ ఎఫ్ కూటమి కూడా విడిగా పోటీ చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com