రాహుల్ గాంధీకి కొన్నాళ్లుగా దేశంలో జరుగుతున్న రాజకీయాల గురించి అవగాహన లేదో .. లేకపోతే ఇప్పుడే తెలుసుకున్నారో కానీ .. ఓట్ల చోరీ పేరుతో ఆయన చేస్తున్న ఉద్యమంలో పాత విషయాన్ని కొత్తగా బయట పెట్టారు. ఈ సారి కూడా కర్ణాటక ఉదాహరణే చెప్పారు. ఒకరికి తెలియకుండానే ఓట్లను తొలగించారని.. కొన్ని వీడియోలు బయట పెట్టారు. ఫామ్ 7 దరఖాస్తులు పెట్టి.. ఓట్లను తొలగించాలని ఆరు వేల ఓట్ల గురించి.. కర్ణాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పారు.
ఫామ్ 7 అనేది పాత సమస్య. 2019 ఎన్నికల ముందు నుంచి 2024 వరకూ టీడీపీ చేసిన ఉద్యమమే దీని గురించి. బీహార్ నుంచి కూడా .. ఏపీలో ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7లు దాఖలు చేశారు. వీటన్నింటిపై టీడీపీ చేసిన పోరాటం ఢిల్లీ స్థాయికి చేరింది. లెక్కలేనంత మందిపై కేసులు పెట్టారు కూడా. కానీ అప్పట్లో టీడీపీ తప్ప ఎవరూ మాట్లాడలేదు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నేతృత్వంలో జరిగిన ఈ ఓట్ల చోరీ గురించి టీడీపీ చేసిన ఉద్యమం పతాక స్థాయికి వెళ్లింది. చివరికి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను పంపించింది. ఉరవకొండ మాత్రమే కాదు.. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన చాలా మంది అధికారులపై చర్యలు తీసుకుంది.
ఓట్ల జాబితా ప్రకటించగానే.. లోపాలను వెదికి మరీ ఫిర్యాదులు చేసింది. లోపాలు లేని ఓటర్ల జాబితాను.. దొంగ ఓట్ల తీసేయడానికి .. తీవ్రంగా శ్రమించింది. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అరాచకం చేయాలనుకుంటే ఇలా చేస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ సమస్య కర్ణాటకలో ఉందని చెబుతున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అయినా అక్కడే లోపాలు ఉన్నాయని రాహుల్ చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. మహారాష్ట్ర , హర్యానా లేదా.. ఇటీవల 75 లక్షల ఓట్లను తొలగించిన బీహార్ లో ఇలాంటివి చేశారని బయట పెట్టి ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. కానీ ఆయనకు కర్ణాటక నుంచి తప్ప మరో చోట నుంచి సమాచారం అందుతున్నట్లుగా లేదు.
రాహుల్ గాంధీ బయట పెట్టేవన్నీ.. బీజేపీ చేస్తుందని.. ఈసీ చేస్తుందని చెప్పలేం. వ్యవస్థీకృతంగా.. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న నేరాలు ఇవి. వీటిపై ఈసీ కఠినచర్యలు తీసుకోవచ్చు. ఈ అంశంలో రాహుల్ గాంధీ చెబుతున్నవి.. ఓటర్ల జాబితాలో తప్పులు.. అధికారంలో ఉన్న పార్టీల కుట్రలే. స్ట్రాటజిస్టుల వ్యూహాలే. అందుకే రాహుల్.. తాను చెబుతున్నది హైడ్రోజన్ బాంబు కాదని.. త్వరలో ఆ బాంబు వేస్తానని అంటున్నారు.
