ఈ సంక్రాంతికి ‘రాజాసాబ్’తో సందడి చేయబోతున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రమిది. డిసెంబరులోనే ఈ సినిమా రావాలి. కానీ సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంలో సంక్రాంతికి వాయిదా వేశారు. దాంతో చిత్రబృందానికి కావాల్సిన సమయం దొరికింది. మూడు వారాల ముందే రాజాసాబ్ సెన్సార్ కాపీ రెడీ చేసేశారు దర్శక నిర్మాతలు. క్రిస్మస్లోగా అన్ని భాషల్లోనూ సెన్సార్ పూర్తి చేయాలన్నది ధ్యేయం. సంక్రాంతి సీజన్లో 7 సినిమాలు వస్తున్నాయి. కాబట్టి సెన్సార్ బోర్డు బిజీ బిజీగా ఉంటుంది. అందుకే ఎలాంటి గొడవ, చివరి నిమిషాల్లో టెన్షన్ లేకుండా వీలైనంత త్వరగా సెన్సార్ పనులు ముగించాలని చూస్తున్నారు.
రాజాసాబ్ రన్ టైమ్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘రాజాసాబ్’ రన్ టైమ్ మూడున్నర గంటలపైమాటే అని సోషల్ మీడియాలో చెప్పుకొంటున్నారు. 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ తో సెన్సార్ కాపీ సిద్ధం చేశారని టాక్. అయితే ఫైనల్ కట్ కోసం 15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. అంటే.. థియేటర్లో 3 గంటల సినిమాని చూసే అవకాశం ఉంది. 3 గంటలంటే ఈ రోజుల్లో లెంగ్తీ సినిమానే. కాకపోతే మారుతి డిజైన్ చేసిన వరల్డ్ బిల్డింగ్, ప్రభాస్ మానియా వల్ల… 3 గంటలు పెద్ద మేటర్ కాకపోవొచ్చు. ‘రాజాసాబ్’ నుంచి ఓ టీజర్, ఓ ట్రైలర్ బయటకు వచ్చాయి. రిలీజ్కు మందు మరో ట్రైలర్ వదులుతారు. ఈసారి ప్రభాస్ ప్రమోషన్లలో చురుగ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
