బిజెపి తెలుగుదేశం పార్టీలు ప్రత్యేక హౌదా నిరాకరించడానికి పెద్ద తతంగం నడిపించాయి. నిరాకరణనే బహుకరణగా చూపించే ప్రహసనం ఇది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, తెలుగు పెద్ద మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన వూహించిన దానికన్నా అధ్వాన్నంగా అఘోరించింది. ఏ విషయంలోనూ నిర్దిష్టత లేదు, నిర్మాణాత్మక ప్రకటన లేదు. క్వాంటిఫికేషన్, క్వాలిఫికేషన్ లేనేలేవు. ఇంత ఆలస్యం చేశామన్న సంకోచం కూడా లేకుండా అరకొర వ్యాఖ్యలతో సాంకేతిక పదజాలంతో సరిపెట్టేశారు. ప్రతిదానికి లెక్కలు చూడాలన్నారు. అంటే ఇంతకాలం కనీసం లెక్కలు కూడా వీరు చూసిన పాపాన పోలేదా? క్షణక్షణం డ్రాఫ్టులు తెప్పించుకుని చూశారంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థరాత్రి ఆగమేఘాల మీద ఆమోదం తెలియజేశాక ఆ వివరాలకు ఎలాగూ విలువ వుండదు. ప్రత్యేక హౌదాపై రాజీలేదు అని పదే పదే ప్రకటించిన ఆయన హౌదా ఇవ్వకపోవడంపై గాని మరే విషయంపై గాని కనీస అసంతృప్తి ప్రకటించేందుకు పోనీ సూచించేందుకు సిద్ధపడలేదు. దాన్ని స్వాగతించేందుకైతే అంత అర్థరాత్రి ఆయన మీడియా గోష్టి జరపాల్సిన అవసరం లేదు. కాని తెలుగుదేశం నేతలు దానికో కారణం చెప్పారు. ప్రజల మాట ఎలా వున్నా తమ పార్టీ కార్యకర్తలైనా బాబుగారు చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవాలంటే ఇలాటి తతంగాలు తప్పవన్నారు. నిజమే కావచ్చు ఫలితం లేని ప్రచార వ్యూహాలు ఎంత కాలం నడుస్తాయి?. పార్టీలు డ్రామాలు ఆడితే ప్రజలు సినిమా చూపిస్తారు.
ఇక ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనంపై కొన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేవలం రిసీవర్‌గా చిత్రించే ప్రయత్నం వెగటు పుట్టించింది. సామాన్యమైన తెలుగు ప్రజలకు కూడా అర్థమైన విషయాలు అత్యున్నత నేతలకు తెలియకే ఇంకా ఎదురు చూస్తున్నారా? ఒక వైపున కలసి మంతనాలు జరుపుతూ పరోక్షంగా ఆమోదాలు తెల్పుతూ మరోవైపున తామే పోరాడుతున్నట్టు చెప్పుకోవడం దేనికి? ఏది ఏమైనా బిజెపితోనే వుంటామని ప్రకటిస్తే రేపు ప్రజలే వివరాలు తెలుసుకుంటారు తదనుగుణంగా స్పందిస్తారు కదా! కేంద్రం ప్రధమ దోషి నిజమే కాని తెలుగుదేశం ఆ దోషంలో భాగస్వామి కాదా? ఎందుకు మన అగ్ర మీడియా కేసరులు వన్‌సైడ్ షోలతో సరిపెడుతున్నట్టు? ఎవరిని కాపాడుతున్నట్టు? ఎందుకు ? హౌదా కోసం పోరాడే యోధులు కూడా ఎందుకు విమర్శలు ఒక్కరికే పరిమితం చేస్తున్నారు? చంద్రబాబుపై మీకు జాలి కలగడం లేదా? ఆయన రాజకీయ భవిష్యత్తుతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని రవి ప్రకాశ్ పదేపదే అడుగుతుంటే విడ్డూరంగా వుండింది. అప్పటికి ఇంకా చంద్రబాబు స్పందించలేదు గనక ఆయన వ్యతిరేకిస్తారన్న అంచనాతో మాట్లాడారేమో గాని తర్వాత ముఖ్యమంత్రి మాత్రం ఎలాటి ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. రవి ప్రకాశ్ జాలి అక్కరకు రాకుండాపోయింది మరీ విచిత్రమేమంటే గుజరాత్ వర్సెస్ ఎపి అన్నట్టు కొత్త వాదన తేవడం. మొన్న విజయవాడలో చర్చ సైడ్లైన్స్లోనూ తెలుగుదేశం నేతలు ఈ తరహా వాదనలే చేశారు. బిసెంట్ రోడ్ సెంటర్లో మాట్లాడుకునే విషయాలు జాతీయ రాజకీయాల చర్చలో వినిపించడం ఎంత హాస్యాస్పదం? రాష్ట్ర విభజన అన్నప్పుడు ఇలాగే చిదంబరం తమిళనాడు కోసం ఎపిని చీలుస్తున్నారని టిడిపి నేతలు వాదించేవారు. ఇవన్నీ వినడం ఇరిటేటింగ్. జాతీయ రాజకీయాలు అంత ఆషామాషిగా అగుపిస్తున్నాయా? చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నరేంద్రమోడీని సవాలు చేసే శక్తిగా వున్నారా?
