రాయదుర్గంలో ప్రభుత్వ బూముల వేలంతో ప్రభుత్వానికి మూడు వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చింది. ఎంఎస్ఎన్ రియాల్టీ .. ఏడున్నర ఎకరాలను .. ఒక్కో ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున కొంటే.. మరో 11 ఎకరాల త్రిభుజాకార ప్లాట్ ను ప్రెస్టీజ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎకరానికి రూ.141.5 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఈ వేలంతో ప్రభుత్వానికి మూడు వేల కోట్లు వస్తున్నాయి. ఇది రికార్డు స్థాయి ధరే. కానీ ఈ ధరలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు పూర్వవైభవం వచ్చిందని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు.
రాయదుర్గంలోని ఆ రెండు భూములు ప్రైజ్ ఏరియాలో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ విదేశీ నగరం మాదిరిగా మారిందని దృశ్యాలు చూపించే అద్దాల మేడలు ఉంటే ఐటీ ఆఫీసుల మధ్య ఈ భూమి ఉంది. అక్కడ పెద్ద ప్లాట్లను కొనుగోలు చేసి.. ఆకాశహర్మ్యాలు నిర్మిస్తే అంతర్జాతీయ సంస్థలు వచ్చి కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయి. దానికి తగ్గ ఆదాయం వస్తుంది. ఈ ప్లాట్లలో ఏ కంపెనీ కూడా ఇళ్ల నిర్మాణం.. నివాస గృహాలను నిర్మించదు. అందుకే ఈ వేలం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కొత్తగా ఊపు రాదు.
నియోపోలిస్ వద్ద గతంలో ప్రభుత్వం ఎకరానికి వంద కోట్లు వచ్చేలా వేలం వేసింది. అక్కడ స్థలాలు కొన్న సంస్థలు ఇప్పుడు ఇళ్లు కడుతున్నాయి. ఆ ఆకాశహర్మ్యాల్లో ఇళ్లు ఇప్పుడు ఒక్కో అపార్టుమెంట్ కు కనీసం ఐదు కోట్లు ఉంటుంది. అది లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెంచుతుందో.. మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ ను స్లంప్ లోకి తీసుకెళ్లిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ నియోపొలిస్ రేట్లను చూసి.. హైదరాబాద్ మొత్తం ధరలు పెంచేశారు. ఇప్పుడు ఉన్న ధరలు.. వచ్చేపదేళ్ల తర్వాత ఉండాల్సినంత ఉన్నాయని ఎక్కువ మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలా వేలం పాటల ద్వారా ఒకరిద్దరు ఆర్థికంగా బలంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కృత్రిమంగా రేట్లు పెంచినంత మాత్రాన.. రియల్ ఎస్టేట్ ఊపందుకోదు.. ఇంకా బలహీనపడుతుంది. రేట్లు పెరిగి మధ్యతరగతి ప్రజలు బంగారంలో పెట్టుబడికి మొగ్గు చూపుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.