హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణల తొలగించే అవకాశాలు ఉండటం రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. మరోవైపు తమ నివాసాలు ఎక్కడ కూలిపోతాయోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా నార్సింగి, కిస్మత్పూర్, లంగర్ హౌస్ వంటి ప్రాంతాల్లో నిర్మించిన పలు లగ్జరీ అపార్ట్మెంట్ల చట్టబద్ధతపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మధు పార్క్ రిడ్జ్ వంటి అపార్ట్మెంట్ వాసులు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని వాదిస్తుండగా, ప్రభుత్వం మాత్రం 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధనను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తోంది. గతంలో అనుమతులు పొందినప్పటికీ, నది గరిష్ట వరద మట్టం పరిధిలోకి వచ్చే నిర్మాణాలపై హైడ్రా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
మూసీ తీరాన ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ వెంచర్ల వల్ల నష్టపోయిన కొనుగోలుదారులు బిల్డర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మార్కెట్లో ఈ ప్రాంతాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు జనం వెనకాడుతున్నారు. హైడ్రా తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపైనే రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.
