సింగీతం శ్రీనివాసరావు ఏ సినిమా చేసినా ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. భైరవద్వీపం, ఆదిత్య 369. విచిత్రసోదరులు, పుష్పక విమానం.. ఇలా ప్రతీదీ డిఫరెంటే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘సింగ్…గీతం’ కూడా అలాంటి ప్రయోగమే. దాదాపుగా కొత్త వాళ్లతో తీసిన సినిమా ఇది. 11న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మాటలు తక్కువ. పాటలు ఎక్కువ. పాత్రలు మాట్లాడుకోవాల్సివచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఓ పాట అందుకొంటారు. అలా మాటలు పాటలైపోతాయన్నమాట. ఈ సినిమాలో దాదాపు 30 పాటలు ఉన్నాయి టాక్. ఇన్ని పాటలతో ఓ సినిమా తెరకెక్కడం ఓ రికార్డ్. ఓరకంగా ఇది సినిమా కాదు. పాటల పుస్తకం అనుకోవాలి.
మరో వెరైటీ ఏమిటంటే.. ఈ పాటలన్నీ ప్రొఫెషనల్ సింగర్స్ పాడలేదు. సినిమాలో ఏ పాత్రపై అయితే ఈ పాట చిత్రీకరిస్తారో, వాళ్లే పాడారు. అంటే నటులే, గాయకులైపోయారన్నమాట. ఎవరి పాట వాళ్లే పాడుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. ‘సింగ్ గీతం’ కోసం ఆడిషన్స్ చేసినప్పుడు ముందు… ‘వీళ్లకు నటన వచ్చా’ అని కాకుండా ‘వీళ్లకు పాడడం వచ్చా’ అనే పాయింట్ పైనే పరీక్ష పెట్టారు. అలా పాడగలిగి, నటించే వాళ్లకే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా.. ఈ సినిమాతో నటీనటుల్ని గాయనీగాయకులు చేసేశారు సింగీతం.
దేవిశ్రీ ప్రసాద్ కు ఇలాంటి సినిమా చేయడం పూర్తిగా కొత్త. అందుకే ఆయన కూడా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ”చిన్నప్పుడు పేపర్ లో వచ్చే వార్తల్ని సరదాగా ట్యూన్ కట్టి పాడేవాడ్ని. ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. మాటల్ని పాటలుగా మార్చడం గమ్మత్తుగా అనిపించింది. ఇది సినిమా కాదు, సింగీతం గారికి ఇచ్చే కానుక” అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ. నాగ అశ్విన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
