తెలుగు సినిమా, తెలుగు దర్శకులు రెహమాన్ ని మర్చిపోయి చాలా కాలమే అయ్యింది. తమన్, దేవిశ్రీ ప్రసాద్ లతో సర్దుకుపోతున్నారు. తెలుగులో రెహమాన్ కొన్ని సినిమాలకు పని చేసినా, గొప్ప ఫలితాలేం రాలేదు. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కోసం రెహమాన్ ని టీమ్ లోకి తీసుకొన్నారు. తెలుగు సినిమా అభిమానుల టేస్ట్ కి తగిన పాటల్ని రెహమాన్ అందిస్తాడా, లేదా? అనే అనుమానాల్ని ‘చికిరి’ పాటతో పటాపంచలు చేసేశాడు రెహమాన్. ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఆల్బమ్ పైనే కాకుండా సినిమా పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. మిగిలిన పాటలు కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈనెలలోనే రెండో పాట కూడా బయటకు రానుంది.
పాటల సంగతి పక్కన పెడితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సంబంధించిన పనులు చిత్రబృందాన్ని ఎక్కువ టెన్షన్ పెడుతోంది. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. మార్చి నెలాఖరు వరకూ షూటింగ్ జరుగుతుంది. ఆ తరవాత.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. ఫిబ్రవరి 18 నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. ఈనెలలో రెహమాన్ కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. ఆయన సినిమాలకు సంబంధించి పనులు ఒప్పుకోరు. పూర్తిగా విశ్రాంతి తీసుకొంటారు. అలాంటప్పుడు ‘పెద్ది’కి ఎలా పని చేస్తారు? రంజాన్ సమయంలో రీ రికార్డింగ్ పనులు పెట్టుకోవద్దని రెహమాన్ ముందే చెప్పార్ట. అంటే.. రంజాన్ తరవాతే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. అదే జరిగితే సినిమా అనుకొన్న సమయానికి పూర్తవుతుందా, లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి.
ఇప్పటికే రెహమాన్ ఫస్టాఫ్ కి సంబంధించిన రీ రికార్డింగ్ మొదలు పెట్టారని, త్వరలోనే ఫస్టాఫ్ ని లాక్ చేస్తారని, సెకండాఫ్ కూడా రెహమాన్ త్వరిత గతిన పూర్తి చేస్తారని చిత్రబృందం నమ్ముతోంది. కాకపోతే రెహమాన్ పర్ఫెక్షనిస్ట్. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న బీజియమ్స్ కి కూడా ఎక్కు వ సమయం తీసుకొంటారు. ‘పెద్ది’లో అలాంటి మూమెంట్స్ ఉంటే మాత్రం అనుకొన్న సమయానికి సినిమా పూర్తవ్వడం కష్టమే. ఈ విషయంలో చిత్రబృందం గానీ, రెహమాన్ కానీ మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిందేనేమో?
