కొనుగోలుదారుల నుంచి మోసం చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో గండిపేట దగ్గర బండ్ల జాగీర్‌లో కడుతున్న శ్రీవారి బృందావనం అనే ప్రాజెక్టు కార్యకలాపాలను తెలంగాణ రెరా నిలిపివేసింది. శ్రీవారి కన్ స్ట్రక్షన్స్ అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. 50:50 వాటాతో 80 ఫ్లాట్లను అభివృద్ధి చేసేలా భూ యజమానులతో ఈ కంపెనీ యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందం ప్రకారం 2023 ఫిబ్రవరి, 2024 మే నెలల్లో ప్రాజెక్టు స్వాధీనం చేయాల్సి ఉంది. ఇప్పటికే సంస్థ ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. పలు ప్లాట్లకు బుకింగ్ అమౌంట్ తీసుకున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగుతోందని చెప్పి.. చాలా మంది దగ్గర పూర్తి స్థాయిలో నగదు వసూలు చేశారు. కానీ నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగించడంలో శ్రీవారి కన స్ట్రక్షన్స్ యాజమాన్యం విఫలమయింది.
కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన రెరా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేంది. ఇకపై డెవలపర్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, బుకింగ్, అమ్మకాలు, అమ్మకపు ఒప్పందాలు చేసుకోవడం వంటి చేయొద్దని ఆదేశించింది. ఆ ప్రాజెక్టులోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేయొద్దని గండిపేట సబ్ రిజిస్ట్రార్ కు సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలూ చేసుకోవద్దని ప్రకటించింది.
రియల్ ఎస్టేట్ సంస్థ నమ్మకంగా లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. శ్రీవారి బృందావనం అనే ప్రాజెక్టు చేపట్టిన సంస్థ కూడా డబ్బులు వసూలు చేసి.. కొనుగోలుదారుల్ని ఇబ్బంది పెడుతోంది.