తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రత్యేక ప్రణాళికపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. పరిపాలనా కార్యక్రమం మాత్రమే కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన వేస్తున్న బలమైన పునాదిగా ఆయన భావిస్తున్నారు. మార్చి 6న ప్రారంభమై జూన్ 12 వరకు సాగే ఈ సుదీర్ఘ కార్యాచరణ ద్వారా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉనికిని చాటడమే కాకుండా, ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచడం రేవంత్ ప్రధాన లక్ష్యం. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి తెలంగాణను ఒక సరికొత్త వికసిత్ తెలంగాణ గా ప్రపంచానికి చూపించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు.
క్షేత్రస్థాయిలో అధికార వికేంద్రీకరణ
ఈ ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. వార్డు మెంబర్ల నుండి కలెక్టర్ల వరకు అందరినీ భాగస్వాములను చేయడం. సాధారణంగా ప్రభుత్వ పథకాలు సచివాలయం నుండి జిల్లా కేంద్రాల వరకే పరిమితమవుతాయి. కానీ రేవంత్ రెడ్డి, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు బాధ్యతలు కేటాయించడం ద్వారా బాటమ్-అప్ పరిపాలనను అమలు చేయాలనుకుంటున్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే శిక్షణా తరగతులు అధికారులకు కేవలం ఆదేశాలు ఇవ్వడానికే కాకుండా, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా వారిని సన్నద్ధం చేయడానికి ఉద్దేశించినవి.
సంక్షేమ పథకాల అమలు – పారదర్శకత
ఈ 99 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలులో ఉన్న అవరోధాలను తొలగించడంపై దృష్టి పెట్టనుంది. ప్రజా పాలన దరఖాస్తుల క్రోడీకరణ పూర్తయిన తర్వాత, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడం, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. జూన్ 2 నాటికి కనీసం కొన్ని లక్షల మందికి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరితే, అది ప్రభుత్వానికి పెద్ద విజయం అవుతుందని, ప్రజల్లో ఉన్న సందేహాలు తొలగిపోతాయని ఆయన భావిస్తున్నారు.
అభివృద్ధి పనులు , మౌలిక సదుపాయాలు
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి లేకుండా చూడటం, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేయడం ఈ 99 రోజుల ప్రణాళికలో అంతర్భాగం. వికసిత్ తెలంగాణ లక్ష్యంలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. పాఠశాలల మరమ్మతులు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి అభివృద్ధికి ఒక కొత్త రూపు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
