భారతీయ జనతా పార్టీతో యుద్ధమే అని ప్రకటించుకున్న తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఎప్పుడూ ప్రధాని హోదాలో ఉన్న మోదీతో ఎదురుపడేందుకు ఆసక్తి చూపించలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినా సరే స్వాగతం చెప్పడానికి కేసీఆర్ కు మనసు అంగీకరించలేదు. ఇక నీతి ఆయోగ్ లాంటి సమావేశాల్లో అసలు పాల్గొనలేదు. దీంతో మోదీతో కేసీఆర్ బంధం పూర్తిగా తెగిపోయింది. నిజానికి అంతగా దూరం పెంచుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా విబేధించడం వేరు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వేరు. ఈ తేడాను కేసీఆర్ గుర్తించలేకపోయారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో మోదీని తీవ్రంగా వ్యతిరేకించేవారిలో స్టాలిన్ మొదటి వరుసలో ఉంటారు. కానీ ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. మోదీతో వ్యక్తిగతంగా నవ్వుతూ మాట్లాడారు. ఇలాంటి లౌక్యాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నప్పటికీ.. రాజకీయాలకు సంబంధం లేని అధికారిక వ్యవహారాల్లో ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. దాని వల్ల పార్టీ హైకమాండ్ లో తనపై అనుమానం తలెత్తుతుందని ఆయన సందేహపడటం లేదు. రాజకీయంగా విబేధించాల్సిన చోట గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని కొంత మంది విమర్శలు చేయవచ్చు కానీ..రేవంత్ రాజకీయంగా ఎప్పుడూ బీజేపీ, మోదీని సమర్థించే ప్రయత్నం చేయలేదు. పాలన చేయాల్సింది రేవంత్ కాబట్టి కేంద్రం సహకారం ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు కాబట్టి దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మాత్రం లౌక్యం తెలియక కేసీఆర్ ఇబ్బంది పడ్డారు. రేవంత్ చాలా చాకచక్యంగా..లౌక్యంగా రాజకీయం చేస్తున్నారు.