ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. విజ్ఞప్తి చేస్తున్నానని అంటూనే.. అడ్డం పడితే పోరాటం ఉంటుందని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏపీలో నీటి వివాదాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరుతున్నానని.. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బ్రతకనివ్వండని వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించాలని చంద్రబాబుకు సూచించారు. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం ..మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఇదే సమావేశంలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతుల పరిస్థితి చూస్తే దుఃఖం వస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరగింది. దీనిపై రేవంత్ మండిపడ్డారు. పాలమూరు గడ్డ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయిండని నీకు దుఃఖం వస్తుందా అని ప్రారంభించి.. తమ తమ ప్రభుత్వం చేసిన అన్ని పనులను ఏకరవు పెట్టి.. అవన్నీ చేసినందుకు కళ్లల్లో నీళ్లు వస్తున్నాయా అని ప్రశ్నించారు.
పదేళ్లు నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నామని.. ఎందుకంత కడుపులో విషం పెట్టుకుని మాపై విషం చిమ్ముతున్నావని మండిపడ్డారు. కెసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో..2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని స్పష్టం చేశారు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడన్నారు.