తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆధ్యాత్మిక అస్త్రాన్ని సంధిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు లౌకికవాదం పేరుతో ఆలయ వ్యవహారాలకు కొంత దూరంగా ఉండేవారు, కానీ రేవంత్ రెడ్డి శైలి ఇందుకు పూర్తి భిన్నం. బీజేపీకి గుత్తాధిపత్యంగా ఉన్న హిందూత్వ నినాదాన్ని తనదైన శైలిలో అందిపుచ్చుకుంటూ, కాంగ్రెస్ అంటే కేవలం మైనారిటీల పార్టీ మాత్రమే కాదు, అది భక్తి – శక్తి ల కలయిక అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
భద్రాద్రి టు యాదాద్రి.. రేవంత్ మార్క్ సాఫ్ట్ హిందూత్వ
ఇటీవల భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ కోసం రూ.351 కోట్ల భారీ మాస్టర్ ప్లాన్ను రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భద్రాద్రిని దక్షిణ అయోధ్య గా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించడం వెనుక లోతైన వ్యూహం కనిపిస్తోంది. బాసర, వేములవాడతో పాటు మూసి నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధిని కూడా వందల కోట్లతో చేపడుతున్నారు. స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ ఆగమ శాస్త్రం ప్రకారం పనులు జరగాలని అధికారులను ఆదేశించడం ద్వారా తానూ ఒక నిఖార్సైన హిందువునని, హిందూ ప్రయోజనాల పరిరక్షకుడినని ఆయన చాటిచెబుతున్నారు.
పోలరైజేషన్కు బ్రేక్
తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం హిందూ ఓట్ల పోలరైజేషన్. అయితే, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్లు, ఆలయాల విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉందనే ముద్రను తొలగించేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. యాదాద్రి విమాన గోపురానికి బంగారం తాపడం పనుల నుంచి, వేములవాడ, కొండగట్టు, బాసర సహా అనేక పుణ్యక్షేత్రాల అభివృద్ధి వరకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు హిందూ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని పెంచుతున్నాయి. తద్వారా హిందూత్వం అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదు అని ఆయన నిరూపిస్తున్నారు.
బీజేపీకి చెక్
మేము భక్తులం.. బీజేపీ భక్తుల వేషంలో ఉన్న రాజకీయ నాయకులు అని నమ్మించేందుకు అసెంబ్లీలోనూ మంత్రి పొన్నం లాంటి వాళ్లు తమకు వచ్చిన అవకాశాల్ని వినియోగింుకున్నారు. ఈ ఆధ్యాత్మిక రాజకీయాల వల్ల అటు మైనారిటీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండానే, ఇటు మెజారిటీ హిందూ ఓటర్లను కూడా తనవైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సఫలమవుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.


