సినిమా అనేది పూర్తిగా వ్యాపారం. దీన్ని ఓ కళగా చూసే రోజులు పోయాయి. పెట్టుబడి – రాబడి మధ్య చాలా తతంగం సాగుతుంటుంది. డబ్బులు వస్తే హిట్టు. పోతే ఫ్లాపు. అదే లెక్క. ప్రేక్షకుల ప్రశంసలు, విమర్శకుల అభినందనలు వచ్చాయా అది బోనస్ అనుకోవాలి. అంతిమ లక్ష్యం రూపాయికి రూపాయి సంపాదించడం. కనీసం నిర్మాత సేఫ్ అయితే చాలు. కానీ.. అలాంటి పరిస్థితి ఎంతమంది నిర్మాతలకు వస్తోంది? నూటికి 90 శాతం ఫెయిల్యూర్స్ ఉన్న ఇండస్ట్రీ ఇది. సినిమాకి `హిట్` టాక్ వచ్చినా సరే, డబ్బులు మిగలని దుస్థితి కూడా అప్పుడప్పుడూ ఎదురవుతుంటుంది. పోస్టర్లు, అంకెలూ సినిమా హిట్ అనే చెబుతాయి. కానీ.. నిర్మాత చేతికి చిల్లిగవ్వ కూడా రాదు. దానికి కారణం హీరో మార్కెట్ కి మించి ఖర్చు చేసేయ్యడమే. ఇది వరకు హీరో మార్కెట్ ని బట్టి, తన సినిమా బడ్జెట్ నిర్ణయించేవారు. ఇప్పుడు ఆ లెక్కల్ని ఎవరూ లెక్కలోనికి తీసుకోవడం లేదు. పాన్ ఇండియా, వరల్డ్ బిల్డింగ్, వీఎఫ్ఎక్స్ మాయాజాలం వీటి మాయలో పడిపోయి కోట్లకు కోట్లు గుమ్మరిస్తున్నారు. బడా హీరోల సినిమాలకు బడ్జెట్ లెక్కలు లేవనుకొంటే ఓకే. కానీ మీడియం రేంజ్ సినిమాలదీ ఇదే పరిస్థితి.
సినిమా సినిమాకూ మార్కెట్ పెంచుకొంటూ వెళ్తున్నాడు నాని. ఇది వరకు నాని సినిమా అంటే రూ.50-60 కోట్లలో పూర్తయ్యేది. కానీ..’దసరా’తో లెక్కలు మారిపోయాయి. అక్కడ్నుంచి ప్రతీ సినిమాకూ బడ్జెట్ పెంచుకొంటూ వెళ్తున్నాడు. `పారడైజ్` బడ్జెట్ అటూ ఇటుగా రూ.150 కోట్లన్న టాక్ వినిపిస్తోంది. నాని మార్కెట్ కి మించిన ఫిగర్ ఇది. సినిమా సూపర్ హిట్ అయితే గానీ రికవరీ ఉండదు. అయినా సరే, నిర్మాతలు ఖర్చుకోసం వెనుకంజ వేయడం లేదు. `పెదకాపు` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కర్ణ. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. రెండో సినిమా `నాగబంధం`. నిజానికి తొలి సినిమా ఫ్లాప్ అయితే, రెండో సినిమాకు బడ్జెట్ కుదించేస్తారు. కానీ విరాట్ కర్ణ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ‘నాగబంధం’ బడ్జెట్ అటూ ఇటుగా రూ.80 కోట్లని టాక్. రెండో సినిమా హీరోపై ఇంత ఖర్చు పెట్టడం నిజంగానే పెద్ద రిస్క్. కానీ దర్శక నిర్మాతలకు అవుట్ పుట్ పై నమ్మకం ఉంది. హీరో ఇమేజ్‌నీ, తన మైలేజీని చూడకుండా బడ్జెట్ గుమ్మరిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కూడా హై బడ్జెట్ సినిమానే. సాయిధరమ్ మార్కెట్ లెక్కల్ని పక్కన పెట్టి ఈ సినిమా తీస్తున్నారు. బడ్జెట్ దాదాపు రూ.120 కోట్లని తెలుస్తోంది. తేజ్ పై ఇది డబుల్ రిస్క్. అయితే కథ డిమాండ్ చేయడం వల్ల, కంటెంట్ పై నమ్మకం ఉండడం వల్ల ఇంత పెడుతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ అనే సినిమా చేస్తున్నాడు. లుధీర్ బైరెడ్డి దర్శకుడు. తనకు ఇదే తొలి సినిమా. కానీ బెల్లంకొండ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా `హైందవ` నిలవబోతోంది. నాగచైతన్య ‘వృషకర్మ’ కూడా ఇదే టైపు. అక్కడ కూడా చైతూ మార్కెట్, రికవరీ లాంటి విషయాల్ని నిర్మాత ఆలోచించడం లేదు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీనే.
సినిమాపై ప్యాషన్ తో పని చేస్తున్నప్పుడు నిర్మాతలు ఇలానే ఆలోచిస్తారు. కాకపోతే రికవరీ అనేది ఇండస్ట్రీలో చాలా కీలకం. డబ్బులు తిరిగొస్తేనే నిర్మాత మరో సినిమా తీయడానికి రెడీ అవుతాడు. బడ్జెట్లు గేట్టు దాటేస్తే కాస్ట్ ఫెయిల్యూర్లు పలకరించే ప్రమాదం ఉంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా, పెట్టుబడిని రాబట్టలేని దుస్థితి మొదలవుతుంది. నిర్మాతలు సేఫ్ జోన్లో ఉండడానికి చూసుకోవాలి. ఓటీటీ, శాటిలైట్, ఏరియాల వారిగా బిజినెస్ లాంటి లెక్కలు వేసుకొన్న తరవాత, అందుకు లోబడే హీరోలతో సినిమాలు చేయాలి. బోర్డర్లు దాటేసినప్పుడు హిట్ అయినా ఆ ఆనందం ఉండదు. పెద్ద సినిమాలు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతాయి. హీరోల ఇమేజ్‌లు, వాళ్ల ఫ్యాన్ బేస్ ప్లస్ అవుతుంది. యువ హీరోలు సైతం ఇదే దారిలో వెళ్తే.. నిర్మాతలకు ఇబ్బందే.
