బీహార్లో ఖచ్చితంగా గెలుపు ఖాయమనుకున్న స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు .. ఓటమికి కారణాలను ముందుగానే చెబుతున్నట్లుగా రాజకీయం మార్చేసుకుంది. ఆర్జేడీతో కలిసి రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర ప్రభుత్వంపై కాదు. ఓట్ల చోరీ అంటూ ఎన్నికల సంఘం మీద. ఆ యాత్ర ప్రజలకు ఎలా కనెక్ట్ అవుతుందో మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ నిర్ణయించుకోలేకపోతున్నాయి. యాత్ర సాగుతోంది కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద చేస్తున్న విమర్శలేం లేవు. వ్యూహాత్మక తప్పిదాల్లా … ఈ పార్టీలు తమ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
గెలవాల్సిన రాష్ట్రం
బీహార్లో నితీష్ కుమార్ పాలన సుదీర్ఘంగా సాగుతోంది. దానికి తగ్గట్లుగా ఆయన రాజకీయాలు చేసుకుంటున్నారు. ఏ పార్టీతో అనుకూలంగా ఉంటే ఆ పార్టీతో కలిసిపోయి తన సీఎం పదవిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కానీ రాను రాను ఆయన పార్టీ చిక్కిపోతోంది. ఒకప్పుడు బీజేపీ మైనర్ పార్టీ.. కానీ ఇప్పుడు నితీష్ కు చెందిన జేడీయూనే మైనర్ పార్టీగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా ఘోరంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రజల్లోనూ నితీష్ కుమార్ పై అసహనం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర ఓటర్లకు కనెక్ట్ అయ్యే రాజకీయాలు చేయాల్సింది పోయి.. సంబంధం లేని అంశాలతో బీహార్ ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారు.
ఓడిపోతే కాంగ్రెస్ చేతకాని మనమే
హర్యానాలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ప్రచారం జరిగింది. సర్వేలు అలాగే వచ్చాయి. కానీ చివరికి ఫలితంతడబడింది. దీనికి కారణం గెలుపు ధీమాతో రాజకీయం చేయడం మానేయడమే. రెండు, మూడు శాతం ఓట్లు ఉన్న ఆప్ ను దూరం చేసుకున్నారు. చివరికి పరాజయం వెక్కిరించింది. అందుకే ఈవీఎంల మీద… ఓట్ల జాబితాల మీద కారణం నెట్టేసి తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకుంటున్నారు. బీహార్ ప్రజలు ప్రస్తుతం తమ సమస్యలపైనే ఆలోచిస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి వంటి వాటిని కోరుకుంటున్నారు. దానిపైనే చర్చ జరగాలనుకుంటున్నారు. కానీ ఆ అజెండాను ముందుకు తీసుకెళ్లలేకపోతోంది కాంగ్రెస్ , ఆర్జేడీ కూటమి.
ప్రశాంత్ కిషోర్ పార్టీతో ఎవరికి నష్టం ?
ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీని పెట్టారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన టార్గెట్ కింగ్ మేకర్ కావడం. గెలిచే అవకాశం లేదు కానీ.. కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. జనసురాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్ల చీలికకు కారణం కానుంది. ఎవరి ఓట్లు చీలుస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా అధికార వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని అనుకుంటారు. అదే జరిగిదే… ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. మరోసారి కాంగ్రెస్, ఆర్జేడీకి నిరాశే ఎదురవుతుంది.. అప్పుడు వారు చెప్పుకోవడానికి కారణాలు అవసరం లేదు.. ఎందుకంటే ఇప్పటికే ఆ కారణాలు చెబుతున్నారు మరి!