తెలంగాణ రాష్ట్ర సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నించిందని.. ఆ విషయం తెలిసి రేవంత్ రెడ్డి మారిపోయారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే సంచలన విషయాలను ఈ వారం కొత్త పలుకు ద్వారా వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇక నుంచి పేరుకే కాంగ్రెస్ సీఎం కానీ ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తారని.. ఏది అయితే అది అవుతుందని.. హైకమాండ్ సంకెళ్లను తెంచుకుని ముందడుగు వేయబోతున్నారని తేల్చేశారు.
రేవంత్ రెడ్డి వల్ల గెలిచినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ .. ఆయనను తక్కువ చేస్తోందని.. స్వేచ్ఛ ఇవ్వడం లేదని.. ఎలాంటి పనులూ చేయనివ్వడం లేదని.. సీనియర్ల శాఖల్లో జోక్యం కూడా చేసుకోనివ్వడం లేదన్న ప్రచారం కొంత కాలంగా ఉంది. అది నిజమని ఆర్కే చెబుతున్నారు. అంతే కాదు.. రేవంత్ రెడ్డిని మార్చాలని కొంత మంది నుంచి అభిప్రాయసేకరణ చేశారట. వారు.. రేవంత్ రెడ్డిని మారిస్తే.. నెలలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారని అందుకే.. హైకమండ్ .. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం అనుకుని సైలెంటుగా గా ఉన్నారని అంటున్నారు.
అయితే ఆ విషయం రేవంత్ కి తెలియడంతో అసలు సినిమా ప్రారంభమయిందని ఆర్కే భావన. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అప్పులు చేసుకున్న రేవంత్.. ఇప్పుడు తన సొంత ఇమేజ్.. సొంత నాయకత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇక నుంచి మంత్రులతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటారని ముఖ్యంగా.. హైకమాండ్ పేరుతో.. ఇక్కడ అడ్డగోలు వ్యవహారాలు చేసే మంత్రులతో చాలా కఠినంగా ఉంటారని ఆర్కే చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీరుపైనా ఆర్కే విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నా.. రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాలపై కుట్రలు చేసుకుంటున్నారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ తీరు గురించి ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ టాపిక్ మొత్తం.. రేవంత్ ను తప్పించాలన్న అంశంపై అభిప్రాయ సేకరణ చేసిన కాంగ్రెస్ హైకమండ్ వ్యవహారంతో పెద్దగా చర్చకు రావడం లేదు. ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ ను అంతగా పట్టించుకునే అవకాశాలు లేవని.. తనను తప్పించాలని అభిప్రాయ సేకరణ చేసి..సాధ్యం కాదని అనుకున్న హైకమాండ్ కు ఇక తలొగ్గాల్సిన పని లేదని.. తన పని తాను చేసుకుంటూ పోతే చాలని రేవంత్ అనుకుంటున్నట్లుగా ఆర్కే జరుగుతోంది. అదే జరిగితే.. తెలంగాణలో ఉండేది.. ఏఐసిసీ కాదు.. రేవంత్ కాంగ్రెస్. స్వయంగా అలా చేసుకునేది.. కాంగ్రెస్ హైకమాండే.