ఆఘ్గని స్థాన్ తో జరిగిన వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ అన్ని విభాగాల్లోనూ పసి కూనపై పై చేయి సాధించింది. ఈ విషయం పక్కన పెడితే.. రోహిత్ శర్మ మళ్లీ విఫలం అవ్వడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. కేవలం 16 పరుగులకే రనౌట్ అయ్యాడు. క్రీజ్ లో కుదురుకున్నట్టే కనిపించిన రోహిత్.. ఓ సింగిల్ తీయబోయి రనౌట్ అవ్వాల్సివచ్చింది. అయితే ఈ విషయంలో తప్పంతా మరో ఓపెనర్ గిల్ దే అనేది నెటిజన్ల వాదన. సింగిల్ కోసం రోహిత్ కదిలినప్పుడు.. గిల్ `ఎస్.. నో` అంటూ ఏదీ చెప్పలేదు. ఈ సమన్వయ లోపంతోనే రోహిత్ రనౌట్ అయ్యాడు. గిల్ కాస్త చురుగ్గా స్పందించి ఉంటే.. అది ఈజీ సింగిల్. రోహిత్ అవుటై పెవీలియన్ చేరుతున్నప్పుడు కూడా.. గిల్ పై తన అసహనాన్ని ప్రదర్శించాడు.
అయితే ఈ మ్యాచ్ తో రోహిత్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అతి పెద్ద వయసులో భారత్ తనపున వన్డే మ్యాచ్ ఆడిన ఘనత సాధించాడు. రోహిత్ వయసు.. 39 ఏళ్ల 75 రోజులు. అంతకు ముందు ఈ రికార్డ్ మొహిందర్ అమర్ నాథ్ ఖాతాలో ఉండేది. 39 ఏళ్ల 36 రోజుల వయసులో ఆయన భారత్ తరపున వన్డే ఆడారు. ఆ రికార్డ్ ని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ లో ఆడాలన్నది రోహిత్ శర్మ కల. అది జరగాలంటే.. అప్పటి వరకూ రోహిత్ ఫామ్ లో ఉండాలి. 40 ఏళ్ల వయసులో వన్డే క్రికెట్ ఆడాలనుకోవడం నిజంగా.. సాహసమే. ఆ మేరకు రోహిత్ తన ఫిట్ నెస్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
