రాజ‌మౌళిపై ఇన్ని కంప్లైంట్లా..?

ఈరోజు రాజ‌మౌళి పుట్టిన రోజు. సాధార‌ణంగా స్టార్ ద‌ర్శ‌కుల పుట్టిన రోజు వ‌స్తుంటే… వాళ్ల సినిమాల‌కు సంబంధించిన టీజ‌రో, ట్రైల‌రో వ‌స్తుంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి మ‌నం ఎలాంటి గిఫ్టులూ ఆశించ‌లేం. ఎలాగూ.. ఎన్టీఆర్ టీజ‌ర్ వ‌స్తోంది క‌దా. క‌నీసం చిత్ర‌బృందం అయినా విష్ చేయాలి క‌దా. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` టీమ్‌లోని కీల‌క స‌భ్యులు రాజ‌మౌళికి అలానే ఓ వీడియో రూపంలో శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే ఎప్ప‌టిలా… `ఆహా.. ఓహో రాజ‌మౌళి` అన‌కుండా కంప్లైంట్లు గుప్పించారు. రాజ‌మౌళి త‌మ‌ని ఎలా చిత్ర హింస‌లు పెడ‌తాడో.. ఒకొక్క‌రూ ఒక్కో రీతిలో వ‌ర్ణించారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, కీర‌వాణి, సింథిల్‌.. ఇలా చిత్ర‌బృందం అంతా.. రాజ‌మౌళి త‌మ‌ని హింసించే విధానం గురించి ఏక‌రువు పెడుతూ ఈ వీడియో విడుద‌ల చేయ‌డం విశేషం.

ఓ పాట ప‌ల్ల‌విని జ‌న‌వ‌రిలో, చ‌ర‌ణాన్ని జులైలో, మిక్సింగ్ ని డిసెంబ‌రులో, రికార్డింగ్ ని వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రిలో చేయిస్తాడు కాబ‌ట్టి పాట‌పై ఇంట్ర‌స్ట్ పోతోంద‌ని కీర‌వాణి ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఈ వీడియోలో.

రిస్కీ షాట్లు ఎలా చేయిస్తాడో.. రామ్ చ‌ర‌ణ్‌.. ఫ‌న్నీ గా వివరించాడు

ఓ షాట్ తీయ‌డానికి ఎన్ని గంట‌లు తీసుకుంటాడో… ఆ బాధ ఎలాంటిదో ఎన్టీఆర్ వ‌ర్ణించాడు.

ఇక అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల బాధైతే వ‌ర్ణనాతీతం. ఇవ‌న్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే.

ద‌ర్శ‌కేంద్రుడ్ని ధీరుడు, వీరుడూ అని పొగ‌డ‌కుండా, పుట్టిన రోజు ఫిర్యాదుల చిట్టా విప్ప‌డం.. అస‌లైన వెరైటీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.