75 ఏళ్లు వచ్చాక తాను ఆరెస్సెస్ చీఫ్‌గా ఉండనని గతంలో ప్రకటించిన మోహన్‌భగవత్ ఇప్పుడు మాట మార్చారు. సాధారణంగా సంఘ్ పరివార్‌లో 75 ఏళ్లు నిండిన వ్యక్తులు క్రియాశీల పదవుల నుంచి తప్పుకుని మార్గదర్శకులుగా కొనసాగాలనే నియమం ఒకటి ఉంది. అయితే ఇది తప్పనిసరి కాదు. సంఘ్ పాటిస్తున్న సంప్రదాయం. అయితే మోహన్ భగవత్ మాత్రం ఇప్పుడు తప్పుకోవడంలేదంటున్నారు. ప్రస్తుతం తనకు ఆ వయసు నిండిన విషయాన్ని మోహన్ భగవత్ స్వయంగా ప్రస్తావించారు. పదవిలో కొనసాగడంపై తన వ్యక్తిగత నిర్ణయం కంటే సంఘ్ ఆదేశాలకే ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెబుతున్నారు.
సంఘ్ నిర్మాణంలో సరసంఘచాలక్ పదవికి సాధారణ ఎన్నికలు ఉండవు. ప్రాంతీయ, విభాగ స్థాయి అధిపతులు చర్చించుకుని ఈ అత్యున్నత పదవికి తగిన వ్యక్తిని నియమిస్తారు. తనకు 75 ఏళ్లు నిండాయని, పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సంఘ్ పెద్దలకు సమాచారం ఇచ్చానని భగవత్ వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యథావిధిగా బాధ్యతల్లో కొనసాగాలని సంఘ్ నిర్ణయించింది. ఒకవేళ ఏ క్షణంలోనైనా తప్పుకోవాలని ఆదేశం వస్తే తాను అందుకు పూర్తి సిద్ధమని ఆయనంటున్నారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 75 ఏళ్ల వయసుకు రావడం, బీజేపీలో కూడా ఇలాంటి వయస్సు నిబంధనలు గతంలో చర్చకు రావడం ఈ వార్తకు ప్రాధాన్యతను పెంచాయి. మోదీతో పాటు మోహన్ భగవత్ కూడా ప్రస్తుతానికి రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపడం లేదని అర్థమవుతోంది. మొత్తంగా అటు బీజేపీ, ఇటు ఆరెస్సెస్‌లలో తమకు ప్రత్యామ్నాయం లేదని మోహన్ భగవత్, మోదీ నిరూపించుకుంటున్నారు.
