రష్యా అంటే అమెరికా తర్వాత అతి పెద్ద సైనిక బలం ఉన్న దేశం. అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇతర దేశాలకు అమ్ముతుంది కూడా. భారత్ ఎక్కువగా ఆ దేశ ఆయుధాల మీద ఆధారపడుతుంది. కానీ తన పొరుగున ఉన్న చిన్న దేశం ఉక్రెయిన్ మీద గెలవలేకపోతోంది. ఏళ్ల తరబడి యుద్ధం చేస్తూ ఆర్థికంగా..సైనిక పరంగా నష్టపోతోంది. ఉక్రెయిన్ పై గెలిచి యుద్ధాన్ని ఎందుకు ముగించడం లేదు?
ఉక్రెయిన్ గగన తలాన్ని నియంత్రించలేకపోయిన రష్యా
రష్యా వద్ద భారీ సంఖ్యలో ట్యాంకులు, క్షిపణులు ఉన్నప్పటికీ, యుద్ధం ప్రారంభంలో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఉక్రెయిన్ కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని భావించిన రష్యా, సరైన ఆహారం, ఇంధనం, మందుగుండు సరఫరా ప్రణాళిక లేకుండా ముందుకు దూకింది. దీనివల్ల కియేవ్కు వెళ్లే మార్గంలో రష్యా ట్యాంకులు మధ్యలోనే ఆగిపోవడం, ఉక్రెయిన్ సైన్యం వాటిని సులభంగా లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. అలాగే, రష్యా తన వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఉక్రెయిన్ గగనతలాన్ని నియంత్రించలేకపోవడం కూడా ఒక పెద్ద వైఫల్యం.
రష్యా సైన్యానికి భారీ నష్టం
యూరప్ దేశాల సహకారం ఉక్రెయిన్ ప్రతిఘటనను ఊహించని రీతిలో పెంచింది. అమెరికా, యూరోపియన్ దేశాలు అందించిన హిమార్స్ వంటి అధునాతన క్షిపణి వ్యవస్థలు, పాట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలు, వేల సంఖ్యలో డ్రోన్లు రష్యా భారీ ట్యాంకు దళాలను నాశనం చేశాయి. డ్రోన్ల యుద్ధం గా మారడంతో, రష్యాకు ఉన్న సంఖ్యాపరమైన ఆధిక్యం కంటే సాంకేతికత ,ఖచ్చితత్వం కలిగిన ఆయుధాలు కీలకంగా మారాయి. దీనివల్ల రష్యా తన ఆధునిక ట్యాంకులను అధిక సంఖ్యలో కోల్పోవాల్సి వచ్చింది.
పుతిన్ వ్యూహాత్మక తప్పిదాలు
రష్యా సైనికులను భారీగా కోల్పోవడానికి అట్రిషన్ వార్ఫేర్ పద్ధతి కారణం. రష్యా ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించే క్రమంలో వేల సంఖ్యలో సైనికులను ఒకేసారి పంపడం వ్యూహాన్ని అనుసరిస్తోంది. చిన్న విజయాల కోసం కూడా రష్యా వేల సంఖ్యలో ప్రాణనష్టాన్ని భరిస్తోంది. రష్యాలో జనసంఖ్య ఎక్కువ కాబట్టి సైనికుల మరణాలను తట్టుకోగలమని పుతిన్ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఇది రష్యా సైనిక నైపుణ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉక్రెయిన్ సైనికుల ఆత్మవిశ్వాసం , భౌగోళిక పరిస్థితులు రష్యాకు సవాలుగా మారాయి. సొంత దేశాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ఉక్రెయిన్ సైనికుల్లో ఎక్కువగా ఉండగా, రష్యా సైన్యంలో సమన్వయ లోపం , నైతిక బలం తగ్గడం కనిపిస్తోంది. అంతిమంగా రష్యా భయపడాల్సినంత గొప్ప సైనికశక్తి కాదని అనుకోవచ్చు. అణుబాంబులను చూపించి అమెరికా,యూరప్ దేశాలను పుతిన్ భయపెడుతున్నారు అంతే.
