జగన్ రెడ్డి ఫైనాన్షియల్ మోడల్ చాలా సింపుల్. రూపాయి పెట్టి కంపెనీ రిజిస్టర్ చేస్తారు. అందులో అతి స్వల్ప వాటాలను వందలకోట్లు పెట్టి ఇతరులు కొంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయా కంపెనీలు విపరీతమైన లాభాలు చూస్తాయి. అదే అధికారం పోయిన తర్వాత మళ్లీ పడకేస్తాయి. ఇలా ఎలా జరుగుతుందో కానీ ఆయన తెలివిని చూసి ఆశ్చర్యపోయేవారు కొందరైతే.. ఇలాంటి బతుకు ఎందుకనుకునేవారు కొంతమంది. తాజాగా సాక్షి పత్రిక యజమాని అయిన జగతి పబ్లికేషన్స్ కు సంబంధించి కంపెనీల శాఖకు ప్రకటించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. అధికారంలోకి రాక ముందు లక్షల్లో ఉన్న జగతి లాభం.. వెంటనే వందల కోట్లలోకి వెళ్లిపోయింది.
జగన్ సీఎం అయ్యే ఏడాది జగతి లాభం 51లక్షల రూపాయలు
సాక్షి పత్రికను అచ్చు వేసే జగతి పబ్లికేషన్స్ కు లాభాలు వస్తాయని ఎవరూ అనుకోరు. ఆ పత్రిక ఖర్చు చాలా ఎక్కువ. ఇతర డిజిటల్ మీడియాలూ నిర్వహిస్తూ ఉంటుంది . కానీ ఆ పత్రికకు విశ్వసనీయత లేదు. మార్కెట్ వర్గాల్లో ఆ పత్రికకు ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం లేదు. అందుకే రెవిన్యూ పెద్దగా ఉండదు. కానీ నష్టాలు చూపించలేరు. అందుకే ఏదో విధంగా.. కనీసం బ్రేక్ ఈవెన్ లో ఉందని చెప్పుకునేందుకు లాభాలు చూపిస్తూ ఉంటారు. ఇలా అధికారంలోకి రాక ముందు 2018-19లో ఆ సంస్థ లాభం 51 లక్షల రూపాయలు. అదే ఓడిపోయే ఏడాది అంటే 2024లో ఆ సంస్థ లాభం 114 కోట్ల రూపాయలు.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ సాక్షికి ప్రజాధనంతో పండుగ
జగన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. సాక్షికి ఫుల్ పేజీల మీల్స్ ప్రారంభమయ్యాయి. విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని సమాచార కమిషనర్ గా తెచ్చి పెట్టుకుని ఎంత కావాలంటే అంత సాక్షి ఖాతాకు మళ్లించుకోవడం ప్రారంభించారు. ఐదేళ్లలో ప్రకటనల కోసం చేసిన ఖర్చులో సగానికిపైగా సాక్షి ఖాతాకు వెళ్లాయంటే ఎలా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు . ఇంత ఘోరమైన దోపిడీకి పాల్పడి.. ఏటా వంద కోట్ల లాభాలను చూపించారు. ప్రభుత్వం వాటిపై దర్యాప్తు చేస్తోంది. ఆ దర్యాప్తు ఏమయిందో స్పష్టత లేదు.
అసలు సాక్షి పత్రికకు జగన్ పెట్టింది స్వల్పం.. కానీ యజమాని ఆయనే
జగతి పబ్లికేషన్స్ లో జగన్ చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు. కానీ అత్యధిక షేర్స్ ఆయనకే. ఉదాహరణకు ఆయన లక్ష పెట్టాలనుకుందాం..కానీ ఆయనకు 95 శాతం షేర్స్ ఉంటాయి. మిగతా కొంత మంది ఐదారు వందల కోట్లు పెట్టుబడి పెట్టారు. వారికి నాలుగైదు శాతం షేర్స్ ఉంటాయి. ఇప్పటికి అలాంటి వారి పేర్లు రికార్డుల్లో ఉంటాయి. కానీ అవన్నీ రికార్డులకే అవి కూడా జగన్ కేకని భారతి సిమెంట్స్ లాంటి వ్యవహాహాలు చూస్తే అర్థమైపోతుంది. వికాస్ కంపెనీ 51శాతం వాటాల్ని కొన్నా.. యజామాన్యం మాత్రం జగన్ కుటుంబం చేతిలోనే ఉంటుంది. అక్కడా అంతే. ఈ చరిత్ర తవ్వుకుంటే ఇంకా శిక్షించలేని మన వ్యవస్థల్ని చూసి మనకు జాలేస్తుంది. ఇలాంటి సంస్థలతో దోపిడీ చేసుకుంటున్నా.. ఆపేవారు లేకపోవడమే ఇంకా ఇంకా అసలైన విషాదం.
