‘చింతకాయల రవి’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందారు యోగి. ఆ తరవాత మళ్లీ ఆయన కనిపించలేదు. ఇంత కాలానికి ఓ సినిమా పట్టాలెక్కించారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. అంతకు ముందు ‘భైరవి’, ‘రాక్షసి’ అనే పేర్లు పరిశీలించారు. దానికంటే ‘బ్లాక్ గోల్డ్’ టైటిల్ అయితే జనంలోకి ఈజీగా వెళ్తుందన్న ఆలోచనతో దీన్ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. దాదాపు సగం సినిమా పూర్తయిపోయింది. ఓ గ్లింప్స్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఆ గ్లింప్స్ తో పాటుగా టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉంది.
‘విరూపాక్ష’, ‘సార్’ చిత్రాలతో సంయుక్తకు మంచి గుర్తింపే వచ్చింది. కమర్షియల్ కథల్లో హీరోయిన్ పాత్రలకు తాను మంచి ఆప్షన్ కూడా. అయితే ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టు ఎంచుకొంది. సాధారణంగా కథానాయికగా ఐదారేళ్ల కెరీర్ తరవాతే.. లేడీ ఓరియెంటెడ్ కథల్ని ఓకే చేస్తారు. కానీ సంయుక్త మాత్రం ముందే ఈ తరహా కథలవైపు మొగ్గు చూపించింది. యోగి కూడా చాలా కాలంగా చిత్రసీమకు టచ్లో లేడు. అయితే… తను చెప్పిన కథ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పేసింది సంయుక్త. ఇది తన కెరీర్ని కొత్త దారివైపు మళ్లిస్తుందని గట్టిగా నమ్ముతోంది. దర్శకుడిగా యోగికి కూడా ఇది కీలకమైన సినిమా. మరి వీరిద్దరూ కలిసి ఏం చేస్తారో చూడాలి.