2026 సంక్రాంతికి రాబోయే సినిమాలు ఏమిటి? అని ఆరా తీస్తే… మొన్నటి వరకూ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాతో పాటుగా, మరో రెండు సినిమాలు లిస్టులో కనిపించేవి. రవితేజ ‘అనార్కలి”ని సంక్రాంతికి తీసుకొద్దామన్నది ప్లాన్. నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ మూడు సినిమాలు మాత్రమే వస్తే పండక్కి కావాల్సినంత స్పేస్ దొరికేది. కాకపోతే ఈ లిస్టు అంతకంతకూ పెరుగుతూపోతోంది.
తాజాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మేకర్స్ ఆలోచన మారింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైతే మరింత ప్రభావం చూపిస్తుందని నిర్మాత నమ్ముతున్నారు. అందుకే సంక్రాంతికి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చిత్రబృందంలో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కూడా సంక్రాంతికే విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. సెప్టెంబరు కల్లా ‘ఉస్తాద్’ పూర్తవుతుంది. ఆ తరవాత కనీసం నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ అనుకొన్నా… అక్టోబరు నాటికి సినిమా సిద్ధం అవుతుంది. కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయడం మంచి ఆప్షన్.
సెప్టెంబరు 25న `ఓజీ`తో పాటుగా ‘అఖండ 2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండూ ఒకే రోజున రిలీజ్ అవ్వడం బాక్సాఫీసుకు పండగే. ఒకవేళ ‘అఖండ 2’ ఈ డేట్ మిస్సయితే… ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉండడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 25 బాలయ్య మిస్ అయ్యే ప్రసక్తే లేదని, అనుకోని అవాంతరాలు వస్తే తదుపరి టార్గెట్ సంక్రాంతి మాత్రమే అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. తెలుగులో సంక్రాంతికి 6 సినిమాలు రాబోతున్నట్టు.
దీంతో పాటు తమిళ సినిమా కూడా ఒకటి రెడీగా ఉంది. విజయ్ ‘జన నాయగన్’ ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. శివ కార్తికేయన్ సినిమా కూడా విజయ్ తో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది. అంటే తమిళం నుంచి 2 సినిమాలు వస్తాయన్నమాట. అలా మొత్తానికి 8 సినిమాల లెక్క తేలుతోంది. ఇందులో కనీసం 6 సినిమాలైతే సంక్రాంతికి ఢీ కొట్టుకోవడం దాదాపు ఖాయం. అదే జరిగితే.. టాలీవుడ్ చరిత్రలోనే ఇది మర్చిపోలేని సంక్రాంతి అవుతుంది. మరి చివరికి మిగిలేవి ఏమిటో… యుద్ధానికి సిద్ధమయ్యేవి ఏమిటో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.