సంక్రాంతి సీజన్ హాట్ కేక్ లా మారిపోయింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే చాలు, కాసుల వర్షం కురుస్తుందన్న నమ్మకంగా చాలా బలంగా బలపడిపోతోంది. అందుకే 2027 సంక్రాంతి గురించి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలైపోయాయి. చిరంజీవి – బాబీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా సంక్రాంతికి వస్తుందన్న విషయం తెలిసిందే. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా పొంగల్ కోసం సిద్ధం అవుతోంది. బాలయ్య సినిమా కూడా సంక్రాంతినే లక్ష్యం చేసుకొంది. ఇప్పుడు నాగార్జున కూడా బరిలో దిగబోతున్నారు. 2027 సంక్రాంతికి నాగ్ సినిమా వస్తోందని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించేసింది. జనవరి 15న సినిమా రిలీజ్ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో 2027 సంక్రాంతి పోటీ మరింత ఉధృతం అయ్యింది.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. వీళ్లంతా ఓతరం హీరోలు. జనరేషన్ల పాటు ఎంటర్టైన్ చేసిన కథానాయకులు. సమకాలికులు. ఒకరితో ఒకరు పోటీ పడినవాళ్లు. వాళ్లంతా ఇప్పుడు ఒకే సీజన్లో తమ సినిమాని విడుదల చేయాలనుకోవడం నిజంగా అబ్బుర పరిచే విషయమే. ఇన్నేళ్ల వీళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదనే చెప్పాలి. చిరు – బాలయ్య, బాలయ్య – వెంకీ, వెంకీ – నాగ్… వీళ్లలో వీళ్లు ఇలా పోటీ పడ్డారు తప్ప.. అంతా ఒలిసి ఒకే సీజన్ లో రాలేదు. వస్తే ఎలా ఉంటుందో 2027 సంక్రాంతి సీజన్లో చూడబోతున్నాం.
ఈ నలుగురూ సంక్రాంతి బరిలో ఉంటే.. మిగిలిన హీరోలకు కష్టమే. శర్వానంద్, తేజా సజ్జా కూడా 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకొని సినిమా చేద్దాం అనుకొంటున్నారు. ఈ నలుగురు సీనియర్ హీరోలు పోటీలో ఉండేదే నిజమైతే వీరిద్దరూ పక్కకు తప్పుకోవాల్సిందే. వీళ్లే కాదు.. మిగిలిన హీరోలూ మరో దారి చూసుకోవాల్సిందే. పవన్ కల్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని టాక్. అయితే ఇలాంటి వాతావరణంలో పవన్ సినిమా కూడా రాకపోవొచ్చు.
ఎవరొచ్చినా, లేకున్నా ఈ నలుగురు హీరోలూ ఒకేసారి బరిలోకి దిగితే – బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఇలాంటి పోటీలో.. హిట్టు కొట్టి, బాక్సాఫీసు రికార్డుని తిరగరాయడం అంటే మాటలు కాదు. మరి ఆ ఘనత సాధించే సినిమా ఏమిటో తెలియాలంటే 2027 సంక్రాంతి వరకూ ఆగాలి.
