రివ్యూ: స‌ర్కార్‌

sarkar sameeksha

తెలుగు360 రేటింగ్: 2.5/5

సోష‌ల్ మెసేజ్ వేరు… క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వేరు అన్న‌ది సినీ ద‌ర్శ‌కులు త‌ర‌చూ చెప్పేమాట‌. ఏదో బ‌ల‌మైన సామాజిక అంశం చెప్ప‌డానికి సినిమా తీస్తే…. అది డాక్యుమెంట‌రీ అయిపోతుంది. హీరోయిజం జోడించాల‌ని చూస్తే.. అస‌లు క‌థ మ‌రుగున ప‌డిపోతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డం అతి త‌క్కువ మందికి కుదిరే విద్య‌. ఆ అతికొద్దిమందిలో మురుగ‌దాస్ త‌ప్ప‌కుండా ఉంటాడు. ర‌మ‌ణ‌, గ‌జిని, తుపాకి, క‌త్తి… ఇలా ఏ పాయింట్ తీసుకున్నా ఈ మేళ‌వింపు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. మ‌రోసారి `స‌ర్కార్‌`కి ఇదే ఫార్ములా ఎంచుకున్నాడు మురుగ‌దాస్‌. మ‌రి… దాన్ని ఎలా మౌల్డ్ చేశాడు? విజ‌య్ అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూ.. తాను చెప్ప‌దల‌చుకున్న పాయింట్ పై ఎలా ఫోక‌స్ చేయ‌గ‌లిగాడు..??

క‌థ‌

ప్ర‌పంచంలోనే ప్రఖ్యాతి చెందిన జి.ఎల్ కార్పొరేట్ సంస్థ‌కు సీఈఓ గా ప‌నిచేస్తుంటాడు సుంద‌ర్ (విజ‌య్‌). త‌నో కార్పొరేట్ మేధావి. ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి ప్ర‌త్యేక విమానంపై ఇండియా వ‌స్తాడు. తీరా చూస్తే.. అప్ప‌టికే త‌న ఓటుని మ‌రొక‌రు వేసేస్తారు. దాంతో… కోర్టుకెక్కుతాడు సుంద‌ర్‌. న్యాయ శాస్త్రాన్ని ఆస‌రాగా చేసుకుని.. కోల్పోయిన త‌న ఓటు హ‌క్కుని మ‌ళ్లీ సాధిస్తాడు. అయితే ఆ క్ర‌మంలో రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రితో త‌ల‌ప‌డాల్సివ‌స్తుంది. కేవ‌లం సుంద‌ర్ వ‌ల్లే.. ఆ రాష్ట్రానికి మ‌రోసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న తీర్పు వెలువ‌డుతుంది. ఆ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రికి ప్ర‌త్య‌ర్థిగా నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యించుకుంటాడు సుంద‌ర్‌. మ‌రి ఈ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంత‌మ‌య్యాడా? త‌న‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి?? ఈ సంగ‌తుల‌న్నీ `స‌ర్కార్‌` చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేష‌ణ‌

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ న‌వ‌ల‌లు చ‌దువుతున్న‌వాళ్ల‌కు `స‌ర్కార్‌`లో క‌థానాయ‌కుడి ప్రయాణం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌దు. ఎందుకంటే అచ్చం యండ‌మూరి న‌వ‌ల‌లో హీరోలా… ఇందులో క‌థానాయ‌కుడికి ఎదురులేదు. అత‌ని తెలివితేట‌ల్ని, ఎత్తుగ‌డ‌ల్ని తిప్పి కొట్టే మొన‌గాడు క‌నిపించ‌డు. హీరో ఏం అనుకుంటే అది జ‌రిగిపోతుంటుంది. ఓ బిలియ‌నీర్ త‌న ఓటు హ‌క్కు కోసం ఇండియా రావ‌డం, ఇక్క‌డ త‌న ఓటు గ‌ల్లంత‌వ్వ‌డం, దాన్ని సాధించుకునే క్ర‌మంలో పోరాటానికి దిగ‌డం ఇవ‌న్నీ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. కానీ… నిజ జీవితంలో ఇదంతా సాధ్య‌మా?? అనికూడా అనిపిస్తుంటుంది. అదే హీరో సామాన్యుడైతే, త‌న వెనుక మందీ మార్బ‌లం లేక‌పోతే… కేవ‌లం త‌న తెలివితేట‌ల‌తో.. ముఖ్య‌మంత్రిని ఎదుర్కొంటే.. అప్పుడు క‌దా కిక్ వ‌చ్చేది.?? ద‌ర్శ‌కుడు ఈ పాయింట్ నుంచి క‌థ అల్లుకుంటే.. సామాన్యుడు మ‌రింత ఈ క‌థ‌లో లీన‌మ‌య్యేవాడేమో…?

హీరో ఇమేజ్‌ని బాలెన్స్ చేసుకుంటూ… ఇలాంటి క‌థ‌ల్ని చెప్ప‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. పైగా రాజ్యాంగం, చ‌ట్టం, ఆర్టిక‌ల్స్.. ఇలా థియ‌రిటిక‌ల్ అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. వాట‌న్నింటినీ సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. అస‌లు `లా`లో ఇదంతా ఉంటుందా, ఉండ‌దా? అనే లాజిక్కుల్ని ప‌క్క‌న పెట్టి క‌థ‌ని ఫాలో అయిపోతుంటాడు ప్రేక్ష‌కుడు. ఇదంతా మురుగ మ్యాజిక్ అనుకోవాలి. అయితే.. హీరో ఇమేజ్‌ని కాపాడే ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కుడు సినిమాటిక్ లిబ‌ర్టీ చాలా తీసేసుకున్నాడు. ఓ ద‌శ‌లో.. మురుగదాస్ క‌థ‌ని సైతం హీరో ఇమేజ్ డామినేట్ చేస్తుంటుంది. `విజ‌య్ అభిమానులు సంతృప్తిప‌డిపోతే చాలు..` అని మురుగ బ‌లంగా ఫిక్స‌యిపోయిన‌ట్టు అనిపిస్తుంది. కోమ‌ల‌వ‌ల్లి (వ‌ర‌ల‌క్ష్మి) వ‌చ్చేంత వ‌ర‌కూ సుంద‌ర్ ఆడిందే ఆట‌, పాడిందే పాట‌. ఎత్తుకు పై ఎత్తు వేసే మ‌రో పాత్ర వ‌చ్చేంత వ‌ర‌కూ క‌థ‌లో కిక్ క‌నిపించ‌దు. ఎప్పుడైతే కోమ‌ల‌వ‌ల్లి వ‌చ్చిందో.. అప్పుడు ద‌ర్శ‌కుడి బ్రిలియ‌న్స్ చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ఈ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు ముందు నుంచీ వాడుకుంటే బాగుండేది. సాధార‌ణంగా మురుగ‌దాస్ సినిమాల్లో గొప్ప స్క్రీన్ ప్లే టెక్నిక్ కనిపిస్తుంటుంది. `తుపాకీ`లో స్లీప‌ర్ సెల్స్‌ని ధ్వంసం చేసే సీన్ అందుకు ఉదాహ‌ర‌ణ‌. అలాంటి సీన్ స‌ర్కార్‌లో ఒక్క‌టీ క‌నిపించ‌లేదు. హీరో – హీరోయిన్ల మ‌ధ్య ట్రాక్ కొత్త‌గా రాసుకోవ‌డంలో దిట్ట మురుగ‌దాస్‌. ఆఖ‌రికి `స్పైడ‌ర్‌`లో కూడా ఆ ట్రాక్ బాగానే ఉంటుంది. `సర్కార్‌`లో హీరోయిన్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు. ఆ పాత్ర కేవ‌లం జూనియ‌ర్ ఆర్టిస్టులా నిల‌బ‌డి ఉంటుంది. ఇక ట్రాకులు ఏం ఆశిస్తాం..??
త‌మిళ నాట ప్రేక్ష‌కులు పొలిటిక‌ల్ సినిమాల్ని బాగా ఆద‌రిస్తారు. వాళ్ల‌కు కావ‌ల్సిన అంశాలు ఇందులో క‌నిపిస్తాయి కూడా. మ‌రి తెలుగులో అలాంటి స‌న్నివేశాల‌కు అంత‌గా స్పందిస్తారా? లేదా? అనేది అస‌లు ప్ర‌శ్న‌.

న‌టీన‌టులు

విజ‌య్ త‌న అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి అన్నివిధాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే అక్క‌డ‌క్క‌డ కాస్త ఓవ‌ర్ అనిపిస్తుంటుంది. సెటిల్డ్‌గా ఉండాల్సిన చోట కూడా.. విజ‌య్ త‌న ముద్ర చూపించ‌డానికి త‌పన ప‌డి.. ఆ ప్ర‌య‌త్నంలో బోర్డ‌ర్ క్రాస్ చేసేశాడు. ఆ ఓవ‌ర్ యాక్టింగ్ తెలుగు ప్రేక్ష‌కులు భ‌రించ‌డం క‌ష్ట‌మే. త‌మిళంలో అభిమానులు మాత్రం పండ‌గ చేసుకుంటారు. కీర్తి పాత్ర‌ల ఎంపిక విష‌యంలో చాలా శ్ర‌ద్ద తీసుకోవాలి. అస‌లేమాత్రం గుర్తింపు లేని ఇలాంటి సినిమాలు చేయ‌డం వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే లాభం ఏమిట‌న్న‌ది త‌నే ప్ర‌శ్నించుకోవాలి. కోమ‌ల‌వ‌ల్లిగా వ‌ర‌ల‌క్ష్మి మ‌రోసారి ఆక‌ట్టుకుంది. హీరోకి ధీటుగా నిల‌బ‌డే పాత్ర అది. మిగిలిన‌వాళ్లు చేసిందేం లేదు.

సాంకేతిక వ‌ర్గం

రెహ‌మాన్ నుంచి చివ‌రిసారిగా ఓ హిట్ గీతం వ‌చ్చి ఎన్నాళ్ల‌య్యిందో అనిపిస్తుంటుంది. `స‌ర్కార్‌` కూడా ఆలోటు తీర్చ‌లేదు. దానికి తోడు.. తెలుగు అనువాదం అస్స‌లు కుద‌ర్లేదు. నేప‌థ్య సంగీతంలోనూ మెరుపుల్లేవు. ప‌తాక స‌న్నివేశాల‌కు ముందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వీణ‌ని ఉప‌యోగించాడు. ఆ సౌండింగ్ ఆక‌ట్టుకుంటుంది. విజ‌య్ సినిమా అంటే.. సాంకేతికంగా గొప్ప‌గా ఉంటుంది. ఈసారీ అదే జ‌రిగింది. మురుగ‌దాస్ క‌థ‌లో మ్యాజిక్కులే ఎక్కువ‌గా క‌నిపించాయి. దానికి హీరోయిజం తోడైంది. దాంతో క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమాకి అడ్డు లేకుండా పోయింది.

తీర్పు

లాజిక్ కి అందని క‌థ ఇది. `ఇలా జ‌రుగుతుందా?` అనే ప్ర‌శ్న ప్ర‌తీసారీ త‌లెత్తుతూనే ఉంటుంది. అవ‌న్నీ మ‌ర్చిపోయి.. విజ‌య్ తాలుకు విన్యాసాలు, తెర‌పై భారీద‌నం, కొన్ని రస‌వ‌త్త‌ర రాజ‌కీయ స‌న్నివేశాలు చూడ్డానికి `స‌ర్కార్‌`ని ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

ఫైన‌ల్ ట‌చ్‌: ఓన్లీ ఫ‌ర్ విజ‌య్ ఫ్యాన్స్‌

తెలుగు360 రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com