కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ రాహుల్ గాంధీపై రాళ్లేస్తున్నారు. ఆయనను పట్టించుకోకుండా కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా వంటి వారికి ప్రాధాన్యమిస్తున్నరని కోపం పెంచుకుని ఇప్పుడు ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. కేసీ వేణుగోపాల్ పై చాలా కోపం ఉందేమోకానీ.. కేరళకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోదని.. ప్రకటించారు. లెఫ్ట్ మళ్లీ గెలుస్తుందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడంలో అయ్యర్ కు ఉన్న సెల్ఫ్ గోల్ రికార్డు ఈ సారి కావాలనే చేశారు.
కేరళలో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం తిరిగి విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అత్యంత బాధ్యతాయుతమైన నాయకుడని అయ్యర్ కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారం కోసం తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో, సొంత పార్టీ నేతే ప్రత్యర్థి కూటమి గెలుస్తుందని చెప్పడం కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉంది. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉంది.
తాను రాహులీయన్ ను కాదని.. గాంధీ సిద్ధాంతాలను నమ్ముతానని.. రాహుల్ నూ టార్గెట్ చేస్తున్నారు.అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే ఖండించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా కేరళలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన చేసిన అంచనాలు ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారాయి. అస్థిరమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ నావను ఇలాంటి అంతర్గత విమర్శలు మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.