ఫిఫ్త్ ఎస్టేట్‌కు కొర‌వ‌డిన సిక్స్త్ సెన్స్‌

ఆకాశంకేసి చూసి, ఉమ్మేస్తే ఏమ‌వుతుంది? మ‌నమొహంమీదే ప‌డుతుంది. మీడియా అంటే ఆకాశం. ఏ దేశంలోనైనా మీడియాకు ఉన్న ప్రాధాన్య‌త దేనికీ లేదు. అదే మీడియా త‌న బాధ్య‌త‌ల‌ను మ‌రిచి, తాను మెచ్చిన రాజ‌కీయ పార్టీకి బాకా ఊద‌డం ప్రారంభిస్తే ఏమ‌వుతుంది. ఆకాశ‌మంత దాని ప్ర‌తిష్ట పాతాళానికి ప‌త‌న‌మ‌వుతుంది. ప్ర‌తి ప‌త్రిక‌కూ ఎవ‌రో ఒక గాడ్ ఫాద‌ర్ ఉంటారు. ఉండాలి. త‌ప్ప‌దు. ఉన్నంత‌మాత్రాన ప్ర‌స్తుత‌మున్నంత నీచ‌స్థాయిలో మీడియా ఏనాడు నీచ‌మైన రాత‌లు రాయ‌లేదు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు ప్రాధాన్య‌మీయ‌లేదు. ఇప్పుడ‌ది తారాస్థాయిని దాటిపోయింది. అందుకే మీడియా ప్ర‌తిష్ట పాతాళానికి ప‌డిపోయింద‌న్న‌ది. ప్రింట్ అండ్ విజువ‌ల్ మీడియాలు చెప్ప‌ని అంశాలను సోష‌ల్ మీడియా హైలైట్ చేయ‌డం ప్రారంభించింది. ఈ విష‌యంలో ఏపీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ముందుంది. ఎంత‌గా అంటే చేస్తున్న విమ‌ర్శ స‌హేతుక‌మా కాదా అనే విచ‌క్ష‌ణ‌ను మ‌రిచిపోయేటంత‌గా. ఇంకెంత‌గా అంటే విమ‌ర్శిస్తున్న వ్య‌క్తి సామాజిక వ‌ర్గాన్ని తృణీక‌రించేటంత‌గా. ఇలాంటి వ్యాఖ్యానాలు వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది క‌లిగిస్తాయేమోన‌నే స్పృహ‌ను వారు మ‌రిచిపోయారు. జ్ఞానాన్ని వీడి అజ్ఞానంలో మునిగారు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ నుంచి ఏడాది పాటు స‌స్పెండ్ అవ‌డానికి కార‌ణ‌మైన టీడీపీ మ‌హిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని ఇప్ప‌ల ర‌వీంద్ర అనే వ్య‌క్తి పెట్టిన పోస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. బెంగ‌ళూరు నుంచి విశాఖ తీసుకొచ్చి విచారిస్తున్నారు. అత‌ని వెంట మేముంటామంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన కొంద‌రు ప్ర‌క‌ట‌న‌లిస్తున్నారు. సాక్షి చానెలైతే ర‌వీంద్ర అరెస్టు దృశ్యాల‌ను ప‌దేప‌దే చూపుతూ, అదేదో ప్ర‌భుత్వ త‌ప్పిద‌మ‌న్న‌ట్లు చెబుతుతోంది.

గౌర‌వ‌నీయ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే ప‌ట్ల గౌర‌వాన్ని చూపాల్సిన బాధ్య‌త అంద‌రికీ ఉంది. అందునా ఆమె ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌. అంద‌రికంటే ఎక్కువ గౌర‌వాన్నీయాలి. త‌ప్ప‌దు. ఎందుకంటే రాజ్యాంగ‌మే వారికి ఆ హ‌క్కును క‌ల్పించింది. మారిన ప‌రిస్థితుల్లో ఇదే హ‌క్కును ఏ కులానికైనా క‌ల్పించాల్సిన అవ‌స‌రాన్ని తాజా సంఘ‌ట‌న‌లు గుర్తుచేస్తున్నాయి. హాస్యం పేరిట సినిమాల‌లో అగ్ర‌వ‌ర్ణాల‌ను ఏ ర‌కంగా వెట‌కారం చేస్తున్న‌దీ అంద‌రూ చూస్తూనే ఉన్నారు. సాక్షాత్తు త్యాగ‌రాజ‌స్వామిని అవ‌మానించే రీతిలో బ్ర‌హ్మానందంతో అపాన‌వాయువును విడుద‌ల చేస్తున్న‌ట్లుగా చూపి, శృతిలో క‌లిపేయ‌నురా అనే డైలాగ్ చెప్పించారు. పాపం త్యాగ‌రాజ‌స్వామి జీవించిలేరు కాబట్టి సరిపోయింది. అనేక చిత్రాల‌లో టీచ‌ర్ల పాత్ర‌ల‌ను కించ‌ప‌రిచేలానూ స‌న్నివేశాలు ఉన్నాయి.. ఉంటున్నాయి.. ప్ర‌పంచానికే చ‌దువు నేర్పే గురువుప‌ట్ల వ్య‌వ‌హ‌రించాల్సిన తీరిదేనా. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియా స్పందించ‌లేదేం? స‌్పందించ‌దు ఎందుకంటే రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నం లేదు కాబ‌ట్టి. స్పందించ‌దు.. ఎందుకంటే వారికి ఎటువంటి రాజ‌కీయ ప‌ర‌ప‌తీ లేదు కాబ‌ట్టి. వైయ‌స్సార్ కాంగ్రెస్ అయినా.. టీడీపీ అయినా సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డిపోతారు.. త‌మ నాయ‌కుల‌ను ఏమైనా అంటే. అక్క‌డికి ప‌రిమిత‌మైతే బాగుండేది. కానీ ఇప్పుడు అరెస్టుల దాకా తీసుకెళ్ళారు. పొలిటిక‌ల్ పంచ్ ర‌వికిర‌ణ్ చూడ్డానికి కొంచెం పెద్ద‌గా క‌నిపిస్తున్నారు. ర‌వీంద్ర‌ను ఎంత‌వ‌ర‌కూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన‌కేసుకొస్తుంద‌నేది సందేహ‌మే. ఎందుకంటే ఆయ‌న‌పై పెట్టింది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్‌. ఆయ‌న కార్టూన్ల రూపంలో త‌న అభిప్రాయాల‌కు వ్యంగ్యం జోడించి, సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నాయ‌కులు చేసే త‌ప్పిదాల‌పై ఆయ‌న పంచ్‌లు ఇవ్వ‌రు ఎందుకంటే.. ఆయ‌న ఆ పార్టీకి బ‌ద్ధుడు కాబ‌ట్టి.. సోష‌ల్ మీడియాను ఫిఫ్త్ ఎస్టేట్‌గా ఆకాశానికెత్తేస్తున్న ప్ర‌ముఖులు మీడియాకు అవ‌స‌ర‌మైన బ్యాలెన్స్ పాటించాల‌ని ఎందుకు చూడ‌రు. ఈనాడులో ఎన్నో కార్టూన్లు వ‌స్తున్నాయి.. ఆ కార్టూనిస్టుల‌ను అరెస్టు చేయ‌రా అని ప్ర‌శ్నిస్తున్నారు. వారు ఒక్క పార్టీకే ప‌రిమితం కారు. వారికో సిద్ధాంత‌ముంది. మీడియాకున్న విలువ‌ల‌ను పాటిస్తారు.

సోష‌ల్ మీడియా పాటిస్తోందా. లేదే. మహిళ‌లంటే అస‌భ్యంగా చిత్రించ‌డం.. ఏమీ చేయ‌లేర‌నుకోవ‌డం. అది త‌ప్ప‌ని తేలిపోయింది కాబ‌ట్టి. ఇక‌నైనా సోషల్ మీడియా స‌మ‌తుల్య‌త‌కు ప్రాధాన్య‌మివ్వాలి. ప్ర‌తి ఒక్క‌రూ స‌బ్ ఎడిట‌ర్ కావ‌చ్చు. యుక్తా, యుక్త విచ‌క్ష‌ణ తెలిసిన ఎడిట‌ర్ సోష‌ల్ మీడియాలో లేర‌ని తెలుసుకోవాలి. ఆ స్థాయికి చేరిన‌ప్పుడు ఎటువంటి ఇబ్బందులుండ‌వు. ప్రింట్ లేదా ఎల‌క్ట్రానిక్ మీడియా అంటారా.. కాలానుగుణంగానూ.. అధికారంలో ఉన్న పార్టీప‌రంగానూ మారిపోతుంటాయి. వ్య‌క్తులు అలాకాదు. మిమ్మ‌ల్ని ఆదుకోవ‌డానికి ఎవ‌రూ రారు. ఇది త‌థ్యం. ఫిఫ్త్ ఎస్టేట్‌కు సిక్స్త్ సెన్స్ కొర‌వ‌డింద‌ని ఇది తెలియ‌చెబుతోంది.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com