సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ తామే ధర్మబద్ధమైన పోలీసులమని భ్రమపడుతున్నారు. అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీ ఏం వేసుకోవాలి, ఎలా సంపాదించాలి, తన జీవితాన్ని ఎలా గడపాలి అనే అంశాలపై తీర్పులు ఇచ్చే హక్కు తమకే ఉందని భావిస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా ఆదాయం గడిస్తుంటే, దాన్ని నేరం గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి బెదిరిస్తున్నారు.
వ్యక్తిగత స్వేచ్ఛ – నేరం కాదు!
యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టడం పూర్తిగా ఆమె వ్యక్తిగత . వ్యాపార నిర్ణయం. గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఈ తరహా ఫీచర్‌ను క్రియేటర్ల ప్రయోజనం కోసమే తెచ్చాయి. దీని ద్వారా ఆమె ఏదో అర్థనగ్న ప్రదర్శన చేస్తోందని, అది నేరమని గొంతు చించుకుంటున్న వారికి అసలు నేరానికి, నేరారోపణకు మధ్య ఉన్న తేడా తెలియకపోవడం విచారకరం. చట్టప్రకారం అశ్లీలత అనేది ఒక పరిధిలో ఉంటుంది, కానీ ఒక సెలబ్రిటీ తన అభిరుచికి తగ్గట్టుగా గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడం చట్టవిరుద్ధం కాదు. నచ్చిన వారు సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చని వారు దూరంగా ఉండవచ్చు. కానీ, వేలు పెట్టి విమర్శించడం కేవలం వికృత మనస్తత్వం మాత్రమే.
హీరోయిన్లకి లేని రూల్స్.. విష్ణుప్రియకే ఎందుకు?
వెండితెరపై హీరోయిన్లు అంతకు మించి అందాలను ఆరబోస్తుంటారు. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్, బికినీ షూట్స్ చూసినప్పుడు రాని ఈ నీతి నియమాలు .. సోషల్ మీడియాలో ఒక యాంకర్ స్వయంగా తన కంటెంట్‌ను మానిటైజ్ చేసుకుంటుంటే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తే అది కళ , అదే ఒక స్వతంత్ర మహిళ తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద చేస్తే ఈజీ మనీ నా? ఈ ద్వంద్వ ప్రమాణాలు మానుకోవాలి. ఇక్కడ ఎవరినీ ఎవరూ బలవంతం చేయడం లేదు. డిమాండ్ ఉన్నచోటే సప్లై ఉంటుంది. ఆమెకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఆ ఫ్యాన్ బేస్‌ను ఆమె ఉపయోగించుకుంటున్నారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.
ఈజీ మనీ’ అనేది ఒక భ్రమ
విమర్శించే వారికి ఇదంతా ఈజీ మనీ గా అనిపించవచ్చు. కానీ ఆమె కష్టం ఆమెకే తెలుసు. ఎదుటివారి కష్టాన్ని తక్కువ చేసి చూడటం, ప్రతిదానిని జడ్జ్ చేయడం అనేది సోషల్ మీడియా పోలీసులకు ఒక అలవాటుగా మారింది. తమ పనులు తాము చేసుకోలేక, పరుల జీవితాల్లోకి తొంగిచూస్తూ విమర్శలు చేసేవారికి.. సంపాదన ఏదైనా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే వారు శ్రమ కంటే విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తారు.
పరిధి దాటుతున్న నీతి సూత్రాలు
సమాజంలో పరిష్కరించాల్సిన సమస్యలు వెయ్యి ఉన్నాయి. కానీ ఈ సోషల్ మీడియా పోలీసులు మాత్రం విష్ణుప్రియ బట్టలు , ఆమె సంపాదన మీద ఫిర్యాదులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ శక్తిని, సమయాన్ని ఇలాంటి పనికిరాని విషయాలపై వెచ్చించే బదులు.. తమ కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెడితే సగం సమస్యలు తీరిపోతాయి. ఒక మహిళా సెలబ్రిటీని టార్గెట్ చేయడం ద్వారా తాము గొప్ప సంస్కృతీ రక్షకులమని ఫీలయ్యే వారు.. నిజానికి సమాజంలో అసహనాన్ని మాత్రమే పెంచుతున్నారు.
విష్ణుప్రియ ఏం చేసినా అది ఆమె ఇష్టం, ఆమె స్వేచ్ఛ. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పనికిరాని ఫిర్యాదుల వల్ల ఆమెను నేరస్తురాలిగా ముద్ర వేయలేరు. ఇతరుల జీవితాలను జడ్జ్ చేయడం మానేసి, ఎవరి జీవితం వారు గౌరవప్రదంగా గడపడం నేర్చుకుంటేనే ఈ సోషల్ మీడియా పోలీసింగ్ అనే రోగానికి విముక్తి లభిస్తుంది.
