ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో విజయసాయిరెడ్డి పేరు ఏ5 నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయనను ఓ సారి ప్రశ్నించారు కానీ అరెస్టు చేయలేదు. అక్కడ ఆయనకు ఊరట లభించినా.. కేంద్ర సంస్థ అయిన ఈడీ మాత్రం వదిలి పెట్టే అవకాశాలు కనిపించడం లేదు.
లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారి కీలక వివరాలు అందించారని, అందుకే సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేయకుండా వదిలేశారనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. అయితే, సిట్ చర్యలతో సంబంధం లేకుండా ఈడీ తనదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో ఆయన నిందితుడేనని స్పష్టం చేస్తూ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోతైన విచారణ జరుపుతోంది. సిట్ వదిలేసినా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ మాత్రం విజయసాయిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తాజా సోదాల ద్వారా సంకేతాలు పంపింది.
2019 నుంచి 2024 మధ్య కాలంలో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయని, మద్యం సిండికేట్ల ద్వారా వచ్చిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని ఈడీ అనుమానిస్తోంది. పలు బోగస్ సంస్థల ద్వారా హవాలా మార్గంలో డబ్బు చేతులు మారిందని, ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర కీలకమని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, కీలక దస్తావేజులు, ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సోదాల సమయంలో ఇంట్లోనే ఉన్న విజయసాయిరెడ్డిని ఈడీ బృందం విచారిస్తోంది. మద్యం డిస్టిలరీల కేటాయింపులు, టెండర్లలో నిబంధనల ఉల్లంఘన , ఆ సొమ్ము ఏయే ఖాతాల్లోకి వెళ్లిందనేదాన్ని తెలుసుకుంటున్నారు.
