కాంగ్రెస్ పార్టీలో ఎలా రాజకీయాలు చేయాలో రేవంత్ రెడ్డి పక్కాగా ఔపాసన పట్టారు. హైకమాండ్‌కు చూపించే విధేయతకు ఎలా మార్కులు పడతాయో ఆయన బాగా ఒంటబట్టించుకున్నారు. ఢిల్లీలో జరిగిన కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు వర్క్ షాప్ లో ఇచ్చిన ప్రజెంటేషన్ సమయంలో చేసిన ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాను ప్రయోగించారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేసినందుకు సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ లేఖ రాశారన్నారు. ఈ లేఖ నాకు ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్ కన్నా ఎక్కువ అన్నారు.
ఎవరికైనా దీన్ని తెలంగాణ మోడల్ ఆఫ్ కుల గణన అని పిలవడంలో ఇబ్బంది ఉంటే మీరు దీనిని RaRe Model పిలవవచ్చునని పేరు కూడా పెట్టారు. తర్వాత రాహుల్ గాంధీ కూడా.. రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారన్నారు. కులగణన నిర్వహించడం అంత తేలిక కాదు..రేవంత్‌రెడ్డి విజయవంతంగా సర్వే చేపట్టారున్నారు. దేశంలో తెలంగాణ కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.
హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదని.. ఫోటోలు కూడా దిగనివ్వడం లేదంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సమావేశంలో సీన్ మారిపోయింది. రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డిని పొగిడారు. సోనియాకు.. రేవంత్ ఆకాశానికెత్తేశారు. వారికి ఏమైనా సందేహాలు ఉంటే.. అలాంటివేమీ పెట్టుకోవద్దని రేవంత్ సందేశం ఇచ్చేశారు. కాంగ్రెస్ లో కావాల్సింది ఇదే.