ఈ దసరా సందర్భంగా శ్రీవిష్ణు నుంచి కొత్త సినిమా కబురు వచ్చింది. ‘కామ్రేడ్ కల్యాణ్’ పేరుతో ఆయన ఓ సినిమా ప్రకటించారు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. టైటిల్ ని బట్టి ఇదేదో సీరియస్ సినిమా అనుకోకండి. శ్రీవిష్ణు కామెడీ మార్క్ ఇందులో చాలానే ఉండబోతోంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఆర్.నారాయణ మూర్తి ఫ్యాన్ గా నటించబోతున్నారు. నారాయణ మూర్తి సినిమాలే ఓ థియేటర్లో ఆడిస్తూ, చూస్తూ పెరిగిన కుర్రాడు… నక్సలైట్ గా ఎందుకు మారాడు అనేదే కథ. ఆ ప్రయాణం చాలా హిలేరియస్‌గా సాగబోతోందని తెలుస్తోంది.
1992.. ఆ ప్రాంతంలో ఆంధ్రా – ఒరిస్సా బోర్డర్లో సాగే కథ ఇది. దాదాపు సగం సినిమా పూర్తయిపోయింది. మహిష్మా నంబియార్ కథానాయికగా నటిస్తోంది. రాధికా శరత్ కుమార్ కీలక పాత్రధారి. టామ్ చాకో విలన్ గా కనిపించబోతున్నాడు. ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు హీరోగా నటించిన ‘మృత్యంజయ’ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈనెలలోనే విడుదల చేయాల్సింది. కానీ.. ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. నవంబరు, లేదా డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.