ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గకుటుంబంపై అనుదీప్ కొటికల్ అనే స్టాండప్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అనుదీప్ తన స్టాండప్ కామెడీ షోలో పవన్ కల్యాణ్ రాజకీయ విధానాల కంటే ఎక్కువగా, ఆయన వ్యక్తిగత జీవితం ,గత వివాహ బంధాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ భార్యలు, పిల్లల పేర్లను ప్రస్తావిస్తూ.. హాస్యం పేరుతో వారిని కించపరిచేలా వ్యంగ్య బాణాలు విసిరారు.
ముఖ్యంగా కుటుంబ సభ్యులను, మహిళలను ఇటువంటి బహిరంగ వేదికలపైకి లాగడం అత్యంత దారుణమైన విషయమని, ఇది క్యారెక్టర్ అస్సాసినేషన్ కిందకే వస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుండి అనుదీప్ కొటికల్పై జనసేన శ్రేణులు మరియు పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని కించపరిచినందుకు గానూ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
లేనిపక్షంలో చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కామెడీకి, వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న గీతను దాటడం వల్లే ఈ వివాదం ఇంతటి తీవ్రరూపం దాల్చింది. ఈ వివాదంపై ఇప్పటి వరకూ స్టాండప్ కమెడియన్ అనుదీప్ స్పందించలేదు.
