చిన్న సినిమాలకి కొత్త కాన్సెప్ట్లే శ్రీరామ రక్ష. అలాంటి కాన్సెప్ట్లని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు సుహాస్. ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘హే భగవాన్’. గోపి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు. తండ్రి చేస్తున్న బిజినెస్ చుట్టూ టీజర్ తిరిగింది. ఆ బిజినెస్ ఏమిటనేది సస్పెన్స్.
సుహాస్, నరేష్ తండ్రి కొడుకులుగా కనిపించారు. చిన్నప్పుడే తండ్రి చేసే బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు సుహాస్. ఆ బిజినెస్ లో చేరాలని కలలు కంటాడు. అయితే ఆ బిజినెస్ ఏమిటనేది తనకీ తెలీదు. ఒక్కసారి ఆ విచిత్రమైన బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత సుహాస్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కాకపోతే ఈ బిజినెస్ గురించి టీజర్ లో రివిల్ చేయలేదు. బహుసా అదే ఈ సినిమా యూఎస్పీ కావచ్చు.
సుహాస్, నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, శివానీ.. ఇలా అందరూ మంచి ఫామ్ లో వున్న నటీనటులే. ముఖ్యంగా నరేష్ మంచి జోష్ లో వున్నారు. ఆయనపై కామెడీ బాగా పండుతోంది. టీజర్ లో కూడా మంచి ఫన్ కనిపించింది. ‘మా వాడు ఎందరో ఇళ్ళల్లో దీపాలు వెలిగించాడు’ టీజర్ లో కొసమెరుపుగా వినిపించిన డైలాగ్ ఇది. ఇందులో చూపించబోతున్న విచిత్రమైన బిజినెస్ ఇదే హింట్. ఆ బిజినెస్ పూర్తి వివరాలు ఫిబ్రవరి 20న థియేటర్ లో రివిల్ చేస్తారు.
