రోజా, కొడాలిపై శాశ్వతంగా అనర్హత!

‘నేను ఏదైనా సింపుల్‌గా చేద్దామనుకుంటానండీ.. కానీ అది చిరిగి చేటంతై.. చాపంతవుద్దండీ’ అని ఒక సినిమాలో డైలాగు ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే వ్యవహారం కూడా అలాగే మారినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విజయవాడ కాల్‌మనీ కేసులను ప్రధానంగా తెరమీదకు తెచ్చి అసెంబ్లీ సమావేశాలే జరగనివ్వకుండా ప్రతిపక్షం గొడవ చేసింది. ఆ సందర్భంగా చాలా రచ్చలే జరిగాయి. సభలో అనుచితంగా వ్యవహరించినందుకు ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సభనుంచి సస్పెండ్‌ చేశారు. దానిపై రోజా హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. వైకాపా దీనిపై పోరాటం ప్రారంభించిన తర్వాత.. స్పీకరు విచారణ నిమిత్తం ఒక కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ ప్రస్తుతం నివేదిక కూడా రూపొందించింది. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి.. రోజాతోపాటు వైకాపాకే చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లను శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా భవిష్యత్తులో పోటీచేసే అవకాశం కూడా లేకుండా స్పీకరు అనర్హత వేటు వేస్తారేమో అనే సంకేతాలు వస్తున్నాయి. ఇక్కడితో ఈ ఎపిసోడ్‌ ముగియడం లేదు. వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూల మీద కూడా క్రమశిక్షణ చర్య తీసుకోనున్నారు. వీరిమీద చర్యలు ఎలా ఉండబోతున్నప్పటికీ.. రోజా, నానిల మీద మాత్రం శాశ్వతంగా అనర్హత వేటు పడవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి రోజా, నానిలు శాసనసభలో చాలా అసభ్యంగా మాట్లాడినట్లుగా అప్పట్లోనే పెద్ద రగడ జరిగింది. సభ్య సమాజం హర్షించలేని పదజాలంతో శాసననిర్మాణం జరిగే పవిత్రమైన శాసనసభలో మాట్లాడడం పట్ల తటస్థులైన వ్యక్తుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వాటికి తగ్గట్లుగానే రోజా మీద ఏడాది సస్పెన్షన్‌ విధించారు. ఆ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయడానికి వైకాపా ప్రయత్నించింది. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో ఓ క్రమశిక్షణ కమిటీని వేశారు. అందులో వైకాపా శ్రీకాంత్‌రెడ్డి కూడా సభ్యులే. కమిటీ ధోరణిపై శ్రీకాంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. వాటికి విలువ లేకుండా పోయింది.

తుది సమావేశం తర్వాత కమిటీ నివేదిక రూపొందించడం కూడా పూర్తయింది. దీని గురించి తెదేపా ఎమ్మెల్యే కమిటీ సభ్యుడు శ్రవణ్‌కుమార్‌ మీడియాకు వివరాలు చెప్పారు. రోజా, నాని లను ఏమాత్రం క్షమించలేమని అంటూనే.. మిగిలిన ముగ్గురు చెవిరెడ్డి, కోటంరెడ్డి, జ్యోతుల లను భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అంటే.. రోజా, నానిల మీద అంతకంటె పెద్ద శిక్షలు సిఫారసు చేసి ఉంటారని అర్థమవుతోంది. ఏతావతా వారిద్దరి మీద శాశ్వతంగా వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది.

సహచర ఎమ్మెల్యే అనితను అత్యంత అసభ్యంగా సభలో దూషించిన రోజా, దానిపై పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడమే ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరిపై శాశ్వతంగా వేటు వేయడం గురించి సిఫారసు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. అంతిమంగా, ఆ నివేదికలో అదే ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]