తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్: “మా” ఈవెంట్‌లో అక్రమాలపై నిజానిజాలు..!

తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్: “మా” ఈవెంట్‌లో అక్రమాలపై నిజానిజాలు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో రెండు వర్గాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అమెరికాలో చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన నిధుల విషయంలో ఈ వివాదం జరుగుతోంది. “మా” అధ్యక్షుడు శివాజీరాజా ఓ వైపు, “మా” ప్రధాన కార్యదర్శి నరేష్ మరో వైపు ఉండి ఈ వివాదాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఈ విషయంలో ఏం జరిగిందనేదానిపై తెలుగు 360 పూర్తి వివరాలు సేకరించింది. డల్లాస్‌లో జరిగిన ఈవెంట్‌ గురించి తెరవెనుక ఏంజరిగిందనే దాని గురించి కూడా తెలుసుకుంది. ఆ వివరాలు ఇవి.

“మా” లో నిధుల దుర్వినియోగం జరిగిందా..?

కచ్చితంగా లేదు. ఎందుకంటే.. చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరు కావాలని నిర్ణయించుకున్న డల్లాస్ ఈవెంట్‌కు సంబంధించి “మా” , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. రూ. కోటి రూపాయలు ఇస్తామని.. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ చెప్పింది. దానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంది. దీనికి సంబంధించి “మా” ప్రధాన కార్యదర్శి నరేష్ సహా అందరూ సంతకాలు చేశారు. చిరంజీవికి కూడా ఈ డీల్ గురించి తెలుసు. ఈ మేరకు మొత్తం ఎమౌంట్‌ శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ “మా” కు చెల్లించింది. అలాగే నరేష్ బిజినెస్ క్లాస్ టిక్కెట్స్‌లో ప్రయాణించారని మా సభ్యులపై ఆరోపణలు చేశారు. అవన్నీ ఈవెంట్ నిర్వాహకులే పెట్టుకున్నారు. “మా” కు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు.

డబ్బులు చేతులు మారడం, క్విడ్ ప్రో కో లాంటివి జరిగాయా..?

జరిగాయి. తెలుగు 360కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొంత నగదుతో పాటు.. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు.. “మా” లో కొంత మందికి అందాయి. అయితే దీనిపై అనేక రకాల చర్చలు ఊహాగానాలు బయట చోటు చేసుకుంటున్నాయి. అది ఏదీ కూడా వాస్తవం కాదు. అన్నీ రూమర్సే.

అధిక నిధులు పొందడానికి “మా” ఏం చేసి ఉండాల్సింది..?

“మా” సిల్వర్ జూబ్లీ వేడుకలు.. అమెరికాలో నిర్వహించాలనుకున్నప్పుడు.. ఈవెంట్ల నిర్వహణ కోసం ఎన్నారైల నుంచి బిడ్లు ఆహ్వానించి ఉండాల్సింది. చిరంజీవితో పాటు అనేక మంది నటులు పాల్గొంటున్నందున..కనీసం రూ. 3కోట్లు వచ్చి ఉండేవి. ప్రముఖ ఈవెంట్ సంస్థలు కూడా.. రూ. కోటి కంటే ఎక్కువే ఆఫర్ చేసి ఉండేవి.

రానున్న ఈవెంట్స్‌కి సంబంధించి “మా” ఏం చేయాలి..?

త్వరలో మహేష్‌బాబుతో … న్యూజెర్సీలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలని “మా” నిర్ణయించింది. దీనికి సంబంధించి ఓపెన్ బిడ్లను ఆహ్వానించాలి.

“మా” లో వివాదాన్ని ఎవరు, ఎందుకు ప్రారంభించారు..?

డల్లాస్ ఈవెంట్ ఎప్పుడో ఏప్రిల్‌లో పూర్తయింది. అంతకు ముందే ఒప్పందాలు ముగిశాయి. నరేష్ వర్గం ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తోంది..? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. న్యూజెర్సీలో మహేష్‌బాబు చీఫ్ గెస్ట్‌గా నిర్వహించాలనుకున్న… ఈవెంట్ ఇబ్బందుల్లో పడింది. వివిధ కారణాలతో హాజరు కావడానికి మహేష్‌బాబు సుముఖంగా లేరు. దాంతో.. ఈవెంట్‌ను రద్దు చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రెండో కారణం..”మా” ఎన్నికలు. త్వరలో “మా” కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. అందుకే పాత గొడవలన్నీ బయటకు వస్తున్నాయి.

“మా” డల్లాస్ ఈవెంట్ నిర్వహించిన ఆర్గనైజర్లు ఎవరు..?

శ్రీకాంత్, శివాజీరాజా స్నేహితులకు ఈవెంట్ హక్కులు కట్టబెట్టారని.. నరేష్ ఆరోపిస్తున్నారు. ఈవెంట్ నిర్వహించిన శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ 2018 జనవరిలో ఇన్ కార్పొరేట్ అయింది. నిఖిల్ నాంచాలి, దేవన్న కుర్మీడ్ల అనే వ్యక్తులు ప్రారంభించారు. గతంలో వంగవీటి, గుంటూరు టాకీస్ లాంటి చిన్న సినిమాలను విదేశాల్లో పంపిణీ చేశారు. ఆ తర్వాత ఇండియా, యూకే, యూఎస్‌లలో ఈవెంట్ మేనేంజ్ సంస్థను ఏర్పాటు చేశారు. డల్లాస్ ఈవెంట్ తర్వాత ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ ఎల్ఎల్‌సీ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థలో పార్టనర్‌గా చేరింది.

చివరి మాట..!

నిజానికి డల్లాస్ ఈవెంట్ పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. మొదటిసారిఈవెంట్ నిర్వహించిన శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. నిర్వాహకులకు కూడా నష్టాలు వచ్చాయి. ఈ విషయంలో ఒకరినొకరు నిందించుకుని..మీడియాకు ఎక్కాల్సినంత అవసరం లేదు. మరింత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com