రాయలసీమలో పనులు చేపట్టే కాంట్రాక్టర్లు, ఇన్వెస్టర్ల నుంచి పర్సంటేజీలను వసూలు చేసే నాయకులు చాలా మంది ఉన్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు ఎక్కువగా ఈ పనులు చేస్తారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోఇలాంటివి ఒకప్పుడు తప్పనిసరి కప్పంలా ఉండేవి. ఎవరు ఎలాంటి పని చేసినా అందులో కొంత శాతం అక్కడ రూల్ చేసే రాజకీయనాయకుడికి కట్టాల్సిందే. కానీ రాను రాను పరిస్థితుల్లోమార్పులు వచ్చాయి. ఆ కాంట్రాక్టర్లుగా రాజకీయ నేతలే అవతారం ఎత్తుతున్నారు. దాంతో ఎవరికీ ఎలాంటి కప్పాలు కట్టాల్సిన అవసరం రావడం లేదు. కానీ రాజకీయ నేతలు మాత్రం తమ పంజాలు విసురుతూనే ఉన్నారు.
ఎంపీ తమ్ముడిని ఎమ్మెల్యే బెదిరించారని మీడియాలో వార్తలు
ఓ ఎంపీ తమ్ముడికి చెందిన కంపెనీ అనంతపురం,కర్నూలులో కొన్ని పనులు చేస్తోంది. అయితే మాకేంటి మా ఏరియాలో పనులు చేస్తున్నారు కాబట్టి మాకు డబ్బులు కట్టాల్సిందేనని ఆ ఎమ్మెల్యే ఒత్తిడిచేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఎంపీ ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసుకున్నారు. తెలిసిన మీడియా ప్రతినిధికి చెప్పిన .. ప్రముఖంగా వచ్చేలా చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాలకు..అధికార వర్గాలకు..సామాన్య ప్రజలకు ఆ ఎమ్మెల్యే ఎవరో అందరికీ తెలిసిపోయింది.కానీ నేరుగా ఆయన పేరు చెప్పుకోరు.
వైసీపీ హయాంలో ఏరియాలు పంచుకున్న నేతలు
వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఇలాంటివి కుప్పలు తెప్పలుగా జరిగాయి. పులివెందులలో ఓ ప్రముఖ కంపెనీ పనులు చేపడుతూంటే జగన్ రెడ్డి బంధువు గన్తో వీరంగం చేశారు. వాటాలివ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు. విషయం పై వరకూ వెళ్లడంతో.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆ జగన్ బంధువును అరెస్టు చేశారు. కానీ బయటకు రాకుండా వసూలు చేసినవి చాలా ఉన్నాయి. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఈ దందాలు సాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత మంది ఇలా చేయడం ..ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
సీమలో ఇలాంటి వారి కట్టడి .. పెట్టుబడులకు చాలా ముఖ్యం !
రాయలసీమలో అభివృద్ధి పనులు, పెట్టుబడులు పెద్దగా గ్రౌండింగ్ కాకపోవడానికి ఇలాంటి బెదిరింపులే సమస్యలు అవుతున్నాయి. కియాను వైసీపీ హయాంలో ఎలా బెదిరించారో చూశాం. జాకీ కంపెనీని ఎలా వెళ్లగొట్టారో అందరూ చేశారు. అభివృద్ధి పనులు అదే పనిగా ఆలస్యం అయ్యాయి. పరిస్థితుల్లో మార్పు వచ్చినా ఇంకా చాలా మంది ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. అధికార దండం లేకపోతే వారెవరూ ఇలా చేయలేరు. అందుకే వారిపై చర్యలు తీసుకుని.. ఆ అధికార దండాన్ని లాగేసుకోవాలి, అలాంటి వారికి చోటు ఉండదని స్పష్టం చేయాలి. అప్పుడే సీమకు కాస్త మేలు జరుగుతుంది.
