తెలుగుదేశం పార్టీలో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తోంది. కడపలో మహానాడు పెట్టడమే దీనికి కారణం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎప్పుడూ మహానాడు కడపలో పెట్టలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా చేయలేదు. మొదటి సారి కడపను మహానాడుకు వేదికగా చేసుకున్నారు. అది కూడా ఈ సారి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీ ఏర్పాట్లు చేసి.. కింది స్థాయి కార్యకర్త వరకూ ఆహ్వానం పంపుతున్నారు. క్రియాశీల కార్యకర్తలంతా మహానాడుకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఎప్పుడైనా ఓ ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది. పద్దతిగా నిర్వహిస్తారు. ప్రజాస్వామ్యిక చర్చలు ఉంటాయి. తీర్మానాలు ఉంటాయి. మంచి చెడులు చర్చించుకుంటారు. వచ్చిన వారందరికి వసతితో పాటు భోజన ఏర్పాట్లూ చేస్తారు. పార్టీ పెద్దలు అందరూ అన్ని స్థాయి నేతలతో కలిసి మెలిసి ఉంటారు. ఈ సారి కడప వేదిక కావడం మరింత ఉత్సాహంగా ఉంది.
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి మింగుడుపడని జిల్లా ఉమ్మడి కడప జిల్లా. ఎప్పుడూ మెజార్టీ స్థానాలు గెలవలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లోనే అది సాధ్యమయింది. ఉమ్మడి కడపలో మొత్తం ఏడు కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయాన్ని నిలబెట్టుకుంటే.. జగన్ రెడ్డి బేస్ కదిలిపోతుంది. ఆ వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు. కడప మహానాడు తర్వాత టీడీపీలో మరింత జోష్ రానుంది.