ఇక‌పై హామీలవారీగా ఉద్య‌మాలకు టీడీపీ రెడీనా..!

క‌డ‌ప స్టీల్ ప్లాంట్ విష‌యంలో కేంద్రం వాద‌న ఎలా ఉందో చూశాం. దీనిపై సుప్రీం కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌, ఆ త‌రువాత భాజ‌పా నేత‌ల మాట‌లు తెలిసినవే. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప క‌ర్మాగారం సాధ‌న దిశ‌గా అధికార పార్టీ తెలుగుదేశం ఉద్య‌మించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. అమ‌రావ‌తిలో మంత్రులు, ఎంపీల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్షం వైకాపా అనుస‌రిస్తున్న వైఖ‌రిని కూడా ఆయ‌న త‌ప్ప‌బ‌ట్టారు.

పొత్త‌ుతో సాధించుకోలేని హామీల‌ను పోరాటం ద్వారా సాధించుకోవ‌డం తప్ప వేరే మార్గం లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ అన్నారు. క‌డప ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం ఎంపీ సీఎం ర‌మేష్ దీక్ష చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి టీడీపీ నేత‌లంతా సంఘీభావం తెల‌పాల‌ని చంద్ర‌బాబు కోరారు. క‌డ‌ప వెళ్లి, అక్క‌డ నిర్వ‌హించ‌బోయే కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. వైకాపా తీరుపై మాట్లాడుతూ… మొన్న ఉక్కు ఫ్యాక్ట‌రీపై కేంద్రం అఫిడ‌విట్ వేస్తే, నిన్న వైకాపా నేత బుగ్గ‌న ఢిల్లీకి వెళ్లి రామ్ మాధ‌వ్ ను ఎందుకు క‌లిశార‌ని ప్ర‌శ్నించారు..? కేంద్రంతో లాలూచీ రాజ‌కీయాలు వైకాపా చేస్తోంద‌నీ, వారి అధినేత‌పై ఉన్న కేసుల్ని బ‌ల‌హీనప‌ర్చుకోవ‌డం కోస‌మే భాజ‌పా అంట‌కాగుతోంద‌ని విమ‌ర్శించారు.

క‌డ‌ప‌లో సీఎం ర‌మేష్ చేయ‌బోతున్న దీక్ష‌ను విజ‌య‌వంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. అయితే, ఇది ఇక్క‌డితో ఆగేలా క‌నిపించ‌డం లేదు. క‌డ‌ప కార్య‌క్ర‌మం త‌రువాత విశాఖ రైల్వే జోన్ పై కూడా ఇదే త‌ర‌హాలో కేంద్రంపై తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయాలంటూ సీఎం సూచించారు. దీంతోపాటు పోల‌వ‌రం నిధులు సాధ‌న‌, వెన‌క‌బ‌డిన జిల్లాల ఆర్థిక ప్రోత్సాహం ద‌క్కేలా ప్ర‌య‌త్నించ‌డం, రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల విడుద‌ల‌… ఇక‌పై అన్ని అంశాల‌పైనా పోరాటం తీవ్ర‌త‌రం చేయాలంటూ ముఖ్య‌మంత్రి సూచించారు.

అంటే, హామీల వారీగా వ‌రుస‌గా టీడీపీ ఉద్య‌మించే అవ‌కాశం క‌నిపిస్తోంది. కేంద్ర‌మంత్రుల రాజీనామాలు, పార్ల‌మెంటులో ఎంపీల పోరాటాలు త‌రువాత‌.. మ‌రోసారి టీడీపీ శ్రేణులు ఈ ఉద్య‌మాల‌కు స‌మాయ‌త్తం అవుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అయితే, ఈ పోరాటాల‌కు కేంద్రం స్పందించి వెంట‌నే త‌మ నిర్ణ‌యాలు మార్చుకుంటుందా అంటే… ఏపీకి మేలు చేయ‌క‌పోయినా, మ‌రింత న‌ష్టం జ‌ర‌క్కుండా ఆగే అవ‌కాశం కచ్చితంగా ఉంటుంది. అందుకు ఉదాహ‌ర‌ణే తాజాగా ఉక్కు క‌ర్మాగారాల‌పై హుటాహుటిన కేంద్రం మాట మార్చిన తీరు! ఇంకోప‌క్క‌, కేంద్రంతో కుమ్మ‌క్క‌వుతూ వైకాపా చేస్తున్న రాజ‌కీయాల‌నూ ఎండ‌గ‌ట్టే అవ‌కాశం కూడా ఉంటుంది క‌దా. వైకాపా, భాజపాలు సంయుక్తంగా ఏపీలోని టీడీపీ పాలనపై తీవ్రంగా చేస్తున్న విమర్శలూ ఆరోపణలను తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.