జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడే విపక్షాలకు ఒక బలమైన రాజకీయ అస్త్రం దొరికింది. భూపాలపల్లి వంటి జిల్లాల రద్దుపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ప్రభుత్వం చాలా కాలం పాటు మౌనం వహించింది. ప్రభుత్వం చెబుతున్న సమస్యలన్నీ భూపాల జిల్లాకు ఉన్నాయి. అందుకే రద్దు ఖాయమని అనుకుంటున్నారు. కానీ రేవంత్ అలాంటి నిర్ణయం తీసుకోలేదని నమ్మవద్దని ప్రజల్ని కోరారు.
సెంటిమెంట్ అస్త్రంగా వాడుకున్న బీఆర్ఎస్
జిల్లాలను మార్పు చేసేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు.. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగించుకుంది. ప్రజల్లో సెంటిమెంట్ బలపడిన తర్వాత ఇప్పుడు జిల్లాల రద్దు ఉండదు అని ప్రకటించడం నష్టం జరిగిన తర్వాత మేల్కొనడం లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భూపాలపల్లి వంటి జిల్లాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ సఫలమైందని చెప్పవచ్చు. అసలు ఉనికిలో లేని సికింద్రాబాద్ జిల్లా గురించి కూడా ప్రచారం జరగడం చూస్తుంటే, ప్రభుత్వం తన విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాల విమర్శలను ఆదిలోనే తిప్పికొట్టకుండా వదిలేయడం వల్ల, ప్రభుత్వం ఏదో ఒక అంతర్గత నిర్ణయం తీసుకుందని, అందుకే ఇప్పుడు వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు సామాన్య ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ ఉద్దేశంపై సందిగ్ధత
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ.. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, దానిపై అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కానీ ఏ జిల్లాను రద్దు చేస్తారో లేదా కొత్తగా ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఈ అస్పష్టతే విపక్షాలకు వరంగా మారింది. ఇప్పుడు రద్దు చేయమని చెబుతున్నా, భవిష్యత్తులో ‘రేషనలైజేషన్’ పేరుతో మార్పులు చేస్తారేమో అన్న అనుమానాలు ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వ వైఖరిలో ఉన్న ఈ సందిగ్ధత భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది.
నిర్లక్ష్యం వెనుక మూల్యం:
ఏదైనా ఒక సున్నితమైన అంశంపై సామాజిక మధ్యమాల్లో , క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. సమస్య జటిలమై, ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడినప్పుడు ఇచ్చే వివరణలు అపరాధ రుసుము చెల్లించినట్టుగా ఉంటాయి తప్ప, పూర్తిస్థాయి భరోసాను ఇవ్వలేవు. రేవంత్ రెడ్డి తాజా ప్రకటన కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమా.. లేకపోతే…. అలాంటి ఆలోచన విరమించుకున్నారా అన్ద్నది త్వరలోనే స్పష్టత రానుంది.
