కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగ్గడ సహా మూడు బ్యారేజీల మరమ్మతుల కోసం కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు హాట్ టాపిక్ అవుతున్నాయి. మే 30 లోపు జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని, ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విధించిన కఠినమైన డెడ్లైన్లు చూస్తుంటే.. ఈ సమస్యను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతోంది. అయితే, వర్షాకాలానికి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఈ లోపు భారీ మరమ్మతులు పూర్తి చేయడం సాంకేతికంగా అసాధ్యమని తెలిసినా ప్రభుత్వం అడుగులు వేయడం పై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
తదుపరి నష్టాన్ని నివారించడమే తక్షణ లక్ష్యం
వర్షాకాలంలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఒకవేళ బ్యారేజీల పునాదుల కింద ఉన్న ఇసుక కోతకు గురైతే ఇప్పటికే కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయి పునరుద్ధరణ కంటే కూడా తాత్కాలిక రక్షణ కోసమేనని తెలుస్తోంది. జియో టెక్నికల్ పరిశీలనల ద్వారా ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో గుర్తించి, వాటిని ఇసుక బస్తాలతో లేదా గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేయడం ద్వారా వర్షాకాలం గట్టెక్కాలన్నది ప్రభుత్వ ప్లాన్.
నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణల నుండి తప్పించుకునే వ్యూహం
ఒకవేళ వర్షాకాలంలో బ్యారేజీలకు ఏమైనా నష్టం వాటిల్లితే, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాజెక్టు కొట్టుకుపోయింది అనే విమర్శలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వంపై తప్పు నెట్టడమే కాకుండా, తాము అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని ప్రజలకు చెప్పుకోవడానికి ఈ కమిటీ ఏర్పాటు , రోజువారీ నివేదికల వ్యూహం ఉపయోగపడుతుంది. ప్రజల్లో, రైతుల్లో ప్రాజెక్టు భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనను తగ్గించడానికి ఇది ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం.
సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో సేఫ్ గేమ్
కేంద్ర జల సంఘం , నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం పనులు చేపట్టడం ద్వారా, రేపు ఏదైనా విపత్తు సంభవిస్తే కేంద్ర సంస్థల మార్గదర్శకాలనే తాము పాటించామని ప్రభుత్వం డిఫెన్స్ లో ఉండొచ్చు. మేడిగడ్డ రిపేర్లు వర్షాకాలంలోపు పూర్తి కావడం అసాధ్యమన్నది చేదు నిజం. కానీ, ఉన్నది ఉన్నట్లుగా కాపాడటం , ప్రజలకు మేము ప్రయత్నిస్తున్నాం అనే నమ్మకాన్ని కలిగించడమే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన వ్యూహం. ఈ లోపు వచ్చే నివేదికల ఆధారంగా వర్షాకాలం తర్వాత పూర్తి స్థాయి శాశ్వత మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది.
