తాడేపల్లి ప్యాలెస్‌లో గోడలకూ చెవులున్నాయి అంటారు.. ఇప్పుడు ఆ చెవులకు వినిపిస్తున్న ఏకైక మాట సజ్జల ఈజ్ బ్యాక్ . మొన్నటి వరకు సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తారని, జగన్ పక్కన ఇక ఆయనే కనిపిస్తారని అంతా భావించారు. కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో వేసిన ఒక రాజకీయ ఎత్తుగడతో చెవిరెడ్డి ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్‌కు తెలియకుండా జరిగిన కొన్ని లోపాయికారీ లావాదేవీల చిట్టాను సజ్జల బయటకు తీశారని టాక్.
ఆరు వందల కోట్ల గుసగుసలు
లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో జగన్ దృష్టికి రాకుండా సుమారు 600 కోట్ల రూపాయల మేర చెవిరెడ్డి వెనకేసుకున్నారనేది సజ్జల వర్గం ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు, లెక్కలతో సహా సజ్జల నేరుగా జగన్‌కే వివరించారని సమాచారం. మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా అని జగన్ విస్తుపోయేలా సజ్జల ఈ విషయాన్ని ప్రజెంట్ చేశారట. దీంతో చెవిరెడ్డిపై జగన్ ఒకింత అసహనానికి గురయ్యారని, అందుకే ఆయనను పక్కన పెట్టి మళ్లీ సజ్జలకే కీలక పనులు అప్పగిస్తున్నారని అంటున్నారు.
విజయసాయిరెడ్డికే తప్పలేదు.. చెవిరెడ్డి ఎంత?
తాడేపల్లి రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. సజ్జలతో పెట్టుకుంటే విజయసాయిరెడ్డి అంతటి వారికే శంకరగిరి మాన్యాలు పట్టారు, ఇక చెవిరెడ్డి ఎంత. గతంలో పార్టీలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డిని కూడా సజ్జల తన చాణక్యంతో తొక్కేశారు. ఆయనిప్పుడు వ్యవసాయం చేసుకుంటూ.. మళ్ళ్లీ జగన్ కరుణిస్తారేమోనని చూస్తున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను చెవిరెడ్డి మీద కూడా ప్రయోగించారు. తన స్థానానికి ఎవరైనా ఎసరు పెడుతున్నారని తెలిస్తే, వారి బలహీనతలను జగన్ ముందు పెట్టడంలో సజ్జల సిద్ధహస్తుడనే ముద్ర పడిపోయింది.
మళ్లీ సజ్జల హవా
కొన్ని రోజులుగా మీడియా ముందుకు రాని సజ్జల, ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రతి నిర్ణయంలోనూ మళ్లీ ఆయన సంతకం కనిపిస్తోంది. మరోవైపు చెవిరెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు. లిక్కర్ లెక్కలు తేలే వరకు ఆయనకు ప్యాలెస్‌లో ఎంట్రీ కష్టమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే, వైసీపీలో పవర్ సెంటర్ ఎక్కడుందో సజ్జల మరోసారి నిరూపించినట్లయింది. గెలిచామా లేదా అన్నది పక్కన పెడితే, ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేయడంలో సజ్జల స్టైలే వేరు అని క్యాడర్ చర్చించుకుంటోంది.
