దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అనగానే కేవలం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య పోరుగానే మనం చూస్తున్నాం. జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని, జనాభా పెరిగిన హిందీ బెల్ట్ రాష్ట్రాలు రాజకీయంగా బలీయంగా మారుతాయని దశాబ్దాలుగా ఒక ఆందోళన నెలకొంది. అయితే, గత ఏడు దశాబ్దాల పార్లమెంటరీ గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన సత్యం వెలుగులోకి వచ్చింది. డిలిమిటేషన్ వల్ల కేవలం ఉత్తరాది రాష్ట్రాలే లాభపడ్డాయన్న వాదనను ఈ గణాంకాలు పటాపంచలు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ కాలంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 1.2 శాతం తగ్గితే, హిందీ బెల్ట్ రాష్ట్రాల వాటా అంతకంటే ఎక్కువగా 3.1 శాతం మేర తగ్గాయి.
పశ్చిమ భారతం – నిశ్శబ్ద విజేత
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఉత్తర-దక్షిణ పోరాటంలో అసలు లాభపడింది మాత్రం పశ్చిమ భారతదేశమే. ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతి సాధిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు లోక్‌సభలో తమ ప్రాతినిధ్యాన్ని స్థిరంగా పెంచుకుంటూ వచ్చాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటిస్తాయని, తద్వారా సీట్లు కోల్పోతాయనే సాధారణ సూత్రం ఇక్కడ పశ్చిమ రాష్ట్రాల విషయంలో భిన్నంగా కనిపిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల రాజకీయ వాటా తగ్గుతున్నప్పుడు, పశ్చిమ తీర రాష్ట్రాలు తమ బలాన్ని పెంచుకుంటూ వచ్చాయి.
ఈశాన్య రాష్ట్రాలకూ మేలు
1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భారత రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పట్లో అనేక కేంద్రపాలిత ప్రాంతాలకు , ఈశాన్య రాష్ట్రాలకు లోక్‌సభలో నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఉండేది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెంచాల్సి వచ్చినప్పుడు, పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో పాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా తమ వాటాలో కొంత మేర వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనివల్ల ఏర్పడిన ఖాళీని కేవలం హిందీ బెల్ట్ మాత్రమే కాకుండా, అటు పశ్చిమ రాష్ట్రాలు, ఇటు కేంద్రపాలిత ప్రాంతాలు భర్తీ చేశాయి.
జనాభా లెక్కలతో అందరికీ నష్టమే
భవిష్యత్తులో జరగబోయే డిలిమిటేషన్ కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకుండా, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. రాబోయే రోజుల్లో హిందీ బెల్ట్ కంటే కూడా పశ్చిమ రాష్ట్రాలే రాజకీయంగా మరింత శక్తివంతమైన పవర్ సెంటర్స్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలకే నష్టం జరుగుతుందన్న ప్రచారం కంటే, పశ్చిమ రాష్ట్రాల ఆధిపత్యం పెరగబోతోందన్న వాస్తవమే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
