జూబ్లిహిల్స్ ఎన్నికల విజయంతో వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నా.. తెలంగాణ ప్రభుత్వం మరో నెల సమయం తీసుకోవాలని నిర్ణయించింది. దానికి కారణం తమ ప్రభుత్వం ఏర్పడినందుకు నిర్వహిస్తున్న సంబరాలే. ప్రజాపాలన సంబరాలను డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంబరాలు ముగిసిన తర్వాత లోకల్ పోల్స్ కు వెళ్లాలని నిర్ణయించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం ముగిసి చాలా కాలం అయింది. కానీ బీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా అడుగు ముందుకు పడటం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ జీవోలు, ఆర్డినెన్స్ లు జారీ చేసింది.కానీ అవి ఎక్కడా వర్కవుట్ కాలేదు. అయినా జీవో ఇచ్చింది. ఆ జీవోపై స్టే వచ్చింది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పాయి. అంటే ఇక బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టమయింది.
పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించడమే రేవంత్ రెడ్డి ముందున్న మార్గం. ఇంకా ఎంతో కాలం ఎన్నికలను ఆపలేరు. ఇప్పటికే లోకల్ పోల్స్ జరగకపోవడం వల్ల గ్రామస్థాయి క్యాడర్ కు పదవులు లభించక అసంతృప్తితో ఉన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లోగా.. మరిన్ని పథకాలు అమలు చేసి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేసిన తర్వాత ఎన్నికలు పెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.