తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం మరోసారి కోర్టుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. కానీ, ఆ పార్టీ స్పందించకముందే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగి పిటిషన్లు వేస్తూ హడావుడి చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారించి, సరైన ఆధారాలు లేవనే కారణంతో కొట్టివేస్తూ వచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి కీలక నేతల విషయంలో కూడా స్పీకర్ నిర్ణయం క్లీన్ చిట్ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం స్పీకర్ తీసుకునే నిర్ణయాల్లో కోర్టుల జోక్యం పరిమితంగా ఉంటుందని, ముఖ్యంగా విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత కోర్టులు స్పీకర్ విచక్షణను తప్పు పట్టలేవని తెలిసినప్పటికీ, ఏలేటి మళ్లీ పిటిషన్లు వేస్తున్నారు.
ఈ వ్యవహారంలో బీజేపీ అధిష్టానం లేదా పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తిస్థాయి మద్దతు ఏలేటికి ఉందో లేదో అన్నది సందేహంగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కోల్పోయి ఆత్మరక్షణలో ఉన్న తరుణంలో, ఆ పార్టీ చేయాల్సిన పోరాటాన్ని ఏలేటి భుజాన వేసుకోవడం ఆ పార్టీ పెద్దలకు నచ్చడంలేదు. బీఆర్ఎస్ నేతలు కూడా మౌనంగా ఉన్న సమయంలో ఏలేటి ఇంతగా ఉత్సుకత చూపడం చూస్తుంటే, ఆయన దానం నాగేందర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు కేవలం మీడియాలో ప్రచారం కోసమేనా లేక నిజంగానే అనర్హత వేటు వేయించగలరా అన్నది సందేహంగా మారింది.
