అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్ అని సమాధానాలు చేతిమీద రాసుకొచ్చి ప్రజల ముందు అప్పచెప్పినట్లుగా భారత రాష్ట్ర సమితి చేస్తున్న రాజకీయాలు ఉంటున్నాయి. ఉద్యమ కాలం నుంచి నాటి చెబుతున్న చంద్రబాబు, ఆంధ్రా కబుర్లు .. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా చెబుతున్నారు. తమకు అధికారం కోల్పోయిన తర్వాత.. తమ పార్టీ పేరుతో తెలంగాణ అనే పేరు ఎత్తేసిన తర్వాత కూడా చెబుతున్నారు. దీని వల్ల ప్రజల్లో ఎమైనా స్పందన ఉందా లేదా అన్న ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారో లేదో స్పష్టత లేదు. కానీ వారు మాత్రం తాము అనుకున్నదారిలోనే వెళ్తున్నారు.
తెలంగాణ పేరు తీసేసి.. జై తెలంగాణ అనడం వైఫల్య రాజకీయం
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు తీసేసి.. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఏపీలోనూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎపీ చీఫ్ ను నియమించారు. అంటే.. సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు అదే సెంటిమెంట్ రాజకీయాలను నమ్ముకుని రాజకీయాలు చేయడం తిరోగమనమే. కానీ దాన్ని బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు ముదురు చంద్రబాబు, ఆంధ్రా అంటే ప్రజలు ఉద్రేకపడ్డారేమో కానీ విభజన జరిగి పదేళ్ల పాటు లేని రాజకీయం.. మళ్లీ బీఆర్ఎస్కు అధికారం పోవడంతోనే మళ్లీ ప్రారంభం కావడం ప్రజల్ని కూడా ఆశ్చర్య పరుస్తుంది. బీఆర్ఎస్ నేతలకు ఇంత అమాయకంగా కనిపిస్తున్నామా అని వారు కూడా విస్మయానికి గురవుతున్నారు.
చంద్రబాబు, ఆంధ్రా బూచిలు ఔట్ డేటెడ్
భారత రాష్ట్ర సమితి … తమ ఉనికే తెలంగాణకు మేలు అని ప్రచారం చేయాలనుకుంటున్నారు. తామే తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామంటున్నారు. అలాంటి పరిస్థితి రావాలంటే.. ఎవరో తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. ఎవరు ఎవర్ని దోచుకుంటారు?. దిగువన సముద్రంలోకి వెళ్లే నీళ్లను ఏపీ మళ్లించుకుంటే మన నీళ్లు దోపిడీ చేస్తున్నారని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం …బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల పనులు ఆంధ్రా కాంట్రాక్టర్లు చేసినా ఇప్పుడు మాత్రమే.. గోల చేయడం.. ఇవన్నీ రాజకీయం అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో మీరు చేసిందేమిటి అన్న ప్రశ్న వస్తుందని అనుకోవడం లేదు.
సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులే బలమనుకుంటున్నారా ?
భారత రాష్ట్ర సమితి పూర్తిగా పతనావస్థలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలు.. పార్లమెంట్ ఎన్నికల నాటికి పునాదులు కదిలిపోయాయి. ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. సోషల్ మీడియాపై చాలా ఖర్చు పెట్టేసి.. ఎక్కువ మందితో పోస్టులు పెట్టించేస్తే పార్టీ బలంగా ఉన్నట్లుగా అవదు. ఏ వర్గాన్నీ దగ్గర చేసుకోకుండా అహంకారంతో అందర్నీ దూరం చేసుకుని.. తమను గెలిపించకపోతే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అన్న డైలాగులు కొడితే…ఓటర్లు పడిపోతారా?. బీఆర్ఎస్ ఎప్పుడు నేర్చుకుంటుంది?.